కర్నూలు కల్చరల్: రక్తదానానికి యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని రాయలసీమ యూనివర్సిటీ వీసీ ఆచార్య వి.వెంకట బసవరావు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో సెనేట్ హాల్‌లో మహిళల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమంతో పాటు రక్తదాన శిబిరం నిర్వహించారు. వీసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలతో పాటు శస్త్రచికిత్సలు, తలసేమియా వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారన్నారు. రక్తదానంపై అపోహలు తొలగిపోయే విధంగా ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. యువత రక్తదానం చేసి ప్రమాదాల్లో ఉన్న వారిని రక్షించాలన్నారు. శిబిరంలో 27 మంది రక్తదానం చేసినట్లు, 87 మంది బ్లడ్ గ్రూపింగ్, హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షించుకున్నారని ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త డాక్టర్ పి.నాగరాజు పేర్కొన్నారు. రెక్టార్ ఎన్‌టీకే నాయక్, రిజిస్ట్రార్ బి.విజయ్‌కుమార్ నాయుడు, డాక్టర్ కె.మాధవీ శ్యామల, వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కె.వెంకటరత్నం, డాక్టర్ బి.విజయుడు, డాక్టర్ ఎస్.నాగచంద్రుడు, బి.శివప్రసాద రెడ్డి, కర్నూలు రెడ్‌క్రాస్ సొసైటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి.శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


