ప్రాణం పోశావు.. ఆటబొమ్మను చేశావు!
అమ్మకు భారమైన పసికందు
నందికొట్కూరు: ఓ మహిళ బిడ్డ పుట్టిన వెంటనే ఆసుపత్రిలో వదిలేసిన ఘటన నందికొట్కూరులో గురువారం వెలుగుచూసింది. వివరాలివీ.. పట్టణంలోని ఆదినగర్‌లో నివాసం ఉంటున్న అవివాహిత మహిళ(30 సంవత్సరాలు) గురువారం తెల్లవారుజామున ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఉదయం 11.50 గంటల సమయంలో ప్రభుత్వ వైద్యశాలకు ఓ మహిళ పసికందుతో పాటు చేరుకుంది. అక్కడి వార్డులో బిడ్డను పడుకోబెట్టి తాగేందుకు నీళ్లు తెచ్చుకుంటానని వెళ్లింది. ఎంతసేపటికీ ఆమె రాకపోవడంతో చుట్టుపక్క మహిళలు ఆసుపత్రి సిబ్బందికి సమాచారం అందించారు. వైద్య సిబ్బంది పసికందును ఇంకుబేటర్‌లో ఉంచి వైద్యం అందించారు. తక్కువ బరువు ఉండటం, వెన్నెముక సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈమె గతంలోనూ ఆసుపత్రిలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ పిల్లలు ఏమయ్యారో తెలియడం లేదని కొందరు, అమ్మేసిందని మరికొందరు చర్చించుకుంటున్నారు. తాత్కాలిక వైద్య సేవల అనంతరం బిడ్డను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించగా.. 108లో మెరుగైన వైద్యం కోసం నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
సీసీ ఫుటేజీతో గుర్తింపు
ఓ మహిళ ఆసుపత్రిలోకి వచ్చి బిడ్డను వదిలి వెళ్లిన దృశ్యాలు ఆసుపత్రిలోని సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఆ ఫుటేజీ ఆధారంగా మహిళ ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీశారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదెల గ్రామానికి చెందిన దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి ముగ్గురు కూతుళ్లు సంతానం. ఇద్దరు కూతుళ్లకు వివాహం కాగా.. ఓ కూతురు కుటుంబాన్ని వదిలి కొన్నేళ్లుగా నందికొట్కూరులో స్థిరపడింది. ఈమె గురువారం ఆడబిడ్డకు ఇంటి వద్దే జన్మనిచ్చింది. అయితే పసికందు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆమె అక్క ఆసుపత్రిలో వదిలేసింది. ఆ తర్వాత తల్లికి కూడా అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రిలోనే చికిత్స నిమిత్తం చేర్పించినట్లు పోలీసులు గుర్తించారు.
ఆ ఇద్దరు పిల్లలు ఏమైనట్లు?
ప్రస్తుతం ఆడబిడ్డను వదిలించుకున్న మహిళ గతంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినట్లు ఆసుపత్రి వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో పిల్లలకు జన్మనిచ్చిన సమయంలో ప్రభుత్వం ఇచ్చే నగదు కోసం ఆసుపత్రి వర్గాలతో గొడవపడినట్లు సమాచారం. అయితే ఆమెకు వివాహం కాకపోవడంతో ఆసుపత్రిలో ప్రభుత్వం తరపున ఇచ్చే నగదును ఇవ్వలేదని చర్చ జరుగుతోంది. అయితే ఈమె పిల్లలను తెలంగాణలో విక్రయించినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మూడో కాన్పులో ఆడపిల్ల జననం
అనారోగ్యంతో వదిలించుకున్న తల్లి
ఆసుపత్రిలో వదిలేసిన వైనం
మెరుగైన చికిత్సకు
నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలింపు


