నిషేధిత పొగాకు రకాలను ప్రోత్సహిస్తే చర్యలు
కర్నూలు(అగ్రికల్చర్): ప్రస్తుత రబీ సీజన్‌లో నిషేధిత పొగాకు రకాలను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి హెచ్చరించారు. గురువారం తన కార్యాలయంలో పొగాకు కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మార్గదర్శకాలను వివరించారు. హెచ్‌డీ బీఆర్‌జీ/హెచ్‌డీ బర్లీ/ బ్లాక్ బర్లీ రకాల పొగాకు సాగును ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందన్నారు. వీటి సాగును ప్రోత్సహించరాదని, రైతులతో ఎలాంటి ఎంఓయూ, కొనుగోలు ఒప్పందం చేసుకోరాదని తెలిపారు. రైతులు, పొగాకు కంపెనీలు విధిగా వంద శాతం బైబ్యాక్ ఒప్పందం చేసుకున్న తర్వాతే వైట్ బర్లీ రకం పొగాకు సాగు చేపట్టాలన్నారు. ఈ నెల 15న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని, అన్ని కంపెనీలు తప్పక హాజరు కావాలన్నారు. సమావేశంలో అగ్రానమీ ఏడీఏ రాజశేఖర్, కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, సాంకేతిక ఏఓ అల్లీపీర, వివిధ పొగాకు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.


