సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించండి
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి. రాధిక కోరారు. గురువారం స్థానిక సంక్షేమభవన్‌లోని తన చాంబర్‌లో సహాయ సంక్షేమాధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వసతిగృహ సంక్షేమాధికారి హాస్టళ్లలోని విద్యార్థుల రక్షణ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. నిబంధనల మేరకు పౌష్టికాహారాన్ని అందించాలని, ప్రతి హాస్టల్‌లో విద్యా వాతావరణం కల్పించాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో అన్ని హాస్టళ్లలో 10వ తరగతి పరీక్షల్లో వంద శాతం ఫలితాలు వచ్చేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో సహాయ సంక్షేమాధికారులు కె.బాబు, ఎస్.లీలావతి, బి.మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.


