క్రమశిక్షణతోనే వైద్య విద్యలో రాణింపు
గోస్పాడు: క్రమశిక్షణతోనే వైద్యవిద్యలో రాణించగలమని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. గురువారం నంద్యాల మెడికల్ కాలేజీని ఆయన పరిశీలించారు. ప్రిన్సిపాల్ చాంబర్‌లో ఆయా విభాగాల హెచ్‌ఓడీలు, వైద్య అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్‌లర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో యూజీ, పీజీ రీసెర్చ్‌కు సంబంధించిన యూనిట్ల ఏర్పాటుకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మెడిసిన్‌లో మూడో సంవత్సరం చదివే విద్యార్థులందరికీ తప్పనిసరిగా బేసిక్ లైఫ్ సపోర్టు, ఫైనల్ ఇయర్ విద్యార్థులకు అడ్వాన్స్ కార్డియాక్ లైఫ్ సపోర్టు నేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెడిసిన్‌లో చేరగానే వైద్య విద్య పూర్తికాదని, క్రమశిక్షణతో మెలిగి డిజిటల్ లైబ్రరీని వినియోగించుకుని, లేటెస్ట్ పుస్తకాలను చదవకపోతే వెనుకబడిపోతారన్నారు. మొదటి ఏడాది వైద్యవిద్యలో చేరిన వారికి సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు స్టడీ అవర్లు నిర్వహించాలని అధికారులకు సూచించారు. మెడికల్ కళాశాలలో బీఎస్సీ ఎమర్జెన్సీ మెడిసిన్, పారామెడికల్ నర్సింగ్ కోర్సులకు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేయిస్తానన్నారు. జీఎంసీ నంద్యాలకు పీజీ సీట్లు మంజూరు కావడం అభినందనీయమన్నారు. అనంతరం వైస్ చాన్స్‌లర్ చంద్రశేఖర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సురేఖ, వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్లు కళావతి, రాజశేఖర్, హెచ్‌ఓడీ మదన్‌మోహన్‌రావు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.


