రోడ్డెక్కిన నాపరాళ్ల ట్రాక్టర్లు
● చెక్‌పోస్టు వద్ద గుమికూడిన
యజమానులు
● రాయల్టీలు లేకుండానే రయ్‌రయ్..
కొలిమిగుండ్ల: నెల రోజుల తర్వాత నాపరాళ్లు రవాణ సాగించే ట్రాక్టర్లు గురువారం రోడ్డెక్కాయి. రాయల్టీ వసూలు నిర్వహణ బాధ్యతను కూటమి ప్రభుత్వం సుధాకర ఇన్‌ఫ్రా సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ గత నెల నుంచి రంగంలోకి దిగింది. ప్రతి ట్రిప్పునకు ఎక్కువ మొత్తంలో రాయల్టీ చెల్లించి రవాణా సాగించాలంటే కష్టంతో కూడుకోవడంతో యజమానులు నాపరాళ్ల రవాణాను ఎక్కడికక్కడే నిలిపేశారు. గనులు, పాలీష్ ఫ్యాక్టరీలు, ట్రాక్టర్ యజమానులు మూడు వందలకు పైగానే యజమానులు ఉదయం జిల్లా సరిహద్దులోని బందార్లపల్లె క్రాస్ రోడ్డు చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు. అప్పటికే 70కి పైగా ట్రాక్టర్లు నాపరాళ్లు లోడ్ చేసుకొని అక్కడికి సిద్ధంగా వచ్చారు. ప్రైవేట్ సంస్థ సిబ్బంది మాత్రం రాయల్టీ ఉంటేనే ట్రాక్టర్లు పంపుతామని పట్టుబట్టారు. పాత పద్ధతిలోనే సింగిల్ రాయల్టీతో రవాణాకు అనుమతించాలని యజమానులు డిమాండ్ చేశారు. ఇందుకు ప్రైవేట్ సంస్థ సిబ్బంది నిరాకరించినట్లు తెలుస్తోంది. నెల రోజుల పాటు కార్మికులకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాపరాళ్ల రవాణా పూర్తిగా స్తంభించింది. జిల్లా సరిహద్దులోని చెక్‌పోస్టు వద్దకు చర్చలకు రావాలని యజమానులు పేర్కొన్నారు. శనివారం యజమానులతో సమావేశం ఏర్పాటు చేస్తామని సంస్థ సిబ్బంది స్పష్టం చేశారు. యజమానులతో పాటు చాలా మంది కూటమి నాయకులు అక్కడికి వచ్చారు. నాపరాళ్ల లోడ్‌తో సిద్ధంగా ఉన్న ట్రాక్టర్లను రాయల్టీ లేకుండానే తాడిపత్రి సమీపంలోని పాలీష్ ఫ్యాక్టరీలకు రవాణా చేశారు. ప్రైవేట్ సంస్థ సిబ్బంది చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు. సీఐ రమేష్‌బాబుతో పాటు పది మంది సిబ్బంది చెక్‌పోస్టు వద్ద బందోబస్తులో ఉన్నారు. ఒక్క రోజే 200 మేర ట్రాక్టర్లలో యజమానులు రాళ్లను ఆఘమేఘాల మీద రవాణా సాగించారు. ఈవిషయంపై ప్రైవేట్ సంస్థ సిబ్బందిని వివరణ కోరగా సమస్య పరిష్కారం కోసం శాంతియుతంగా ధర్నా రూపంలో నిరసన వ్యక్తం చేయకుండా స్థానిక నాయకులు, యజమానులు నాపరాళ్ల లోడ్ ట్రాక్టర్లతో వచ్చి రాయల్టీ లేకుండా పంపించారని తెలిపారు.
రోడ్డెక్కిన నాపరాళ్ల ట్రాక్టర్లు


