ఆహార పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కింద వివిధ పరిశ్రమల ఏర్పాటుకు చిరు వ్యాపారులు, ఔత్సాహికులను ప్రోత్సహించాలని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వైపి రమణారెడ్డి తెలిపారు. గురువారం కర్నూలు శివారులోని టీటీడీసీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కింద పిండిమరలు, పచ్చళ్ల తయారీ, మిరప, పసుపు పొడి తయారీ, మినీ రైస్ మిల్లులు, ధాల్ మిల్లులు, పశువుల దాణా తయారీ తదితర యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. వీటికి పీఎంఎఫ్‌ఎంఈ కింద 35 శాతం సబ్సిడీ లభిస్తుందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు కేవలం 10 శాతం పెట్టుబడితో రాణించవచ్చన్నారు. యూనిట్లకు ప్రధానమంత్రి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం కింద గరిష్టంగా రూ.10 లక్షల వరకు రాయితీ లభిస్తుందని వెల్లడించారు. యూనిట్ వ్యయం రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉండే పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 040–45901100 నెంబర్‌ను సంప్రదించాలన్నారు. సమావేశంలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ప్రతినిధి మారుతి, డీపీఎం నరసమ్మ, ఏపీఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


