అందని సబ్సిడీ శనగ విత్తనాలు
కరువు నేలపై ‘కూటమి’ కాఠిన్యం
ఎల్లెల్సీ పరిధిలో రెండో పంట సాగు కష్టమే
తుంగభద్ర దిగువ కాలువ కింద ఈ ఏడాది రెండో పంటకు నీరందే పరిస్థితి లేదు. టీబీ డ్యాం గేట్ల మార్పుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకపోవడంతో భారీ వర్షాలు కురిసినా, నీటిని వినియోగించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ కారణంగా ఎల్‌ఎల్‌సీ పరిధిలో 1,07,615 ఎకరాలు, కేసీ కెనాల్ కింద 1.50 లక్షల ఎకరాలు, ఎగువ కాలువ పరిధిలోని ఆలూరు బ్రాంచ్ కెనాల్ ఆయకట్టుకు (20 వేల ఎకరాలు) నీరందని పరిస్థితి నెలకొంది. డ్యాంలో నీరు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గేట్ల మార్పు సాకుతో ఆయకట్టు రైతులకు అన్యాయం చేస్తుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. శ్రీశైలం నీటిపై ఆధారపడిన తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ కాలువల పరిధిలో రెండో ఆయకట్టు సాగుపై ఇప్పటి వరకు స్పష్టత లోపించింది.
కర్నూలు(అర్బన్): కరువు నేలపై కూటమి ప్రభుత్వం కాఠిన్యాన్ని ప్రదర్శిస్తోంది. కరువును అధిగమించాల్సిన కార్యక్రమాలపై దృష్టి సారించడం లేదు. జిల్లాలోని పశ్చిమ పల్లెలు ఖాళీ అవుతున్నాయి. గ్రామాల్లో పనుల్లేక, పస్తులండలేక వేల సంఖ్యలో ప్రజలు దూర ప్రాంతాలకు పనుల కోసం వలసలు వెళ్తున్నారు. ఇళ్ల వద్ద వృద్ధులను మాత్రమే ఉంచి పిల్లలను సైతం తమ వెంట తీసుకెళ్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లోని అనేక గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల హాజరు గణనీయంగా తగ్గినట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి.
ఆర్థిక కష్టాలు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులకు జిల్లా వ్యాప్తంగా ఐదు వేలకు మంచి కూలీలు హాజరు కావడం లేదంటే, వలసల ప్రభావం ఎంత మాత్రం ఉందో ఊహించుకోవచ్చు. పైగా కూలీలకు చెల్లించాల్సి వేతనాలు ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.5 కోట్ల వరకు ప్రభుత్వం బకాయి పడినట్లు తెలుస్తోంది. అలాగే ఉపాధి నిధులతో చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనులకు (సీసీ రోడ్లు, డ్రైనేజీ, ప్రహరీగోడలు, పశువుల షెడ్లు, సోక్‌పిట్స్) కూడా దాదాపు రూ.100 కోట్ల వరకు నిధులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. వ్యవసాయ కూలీల పరిస్థితి ఈ విధంగా ఉంటే ... రైతుల పరిస్థితి చెప్పనలవి కాదు. అతివృష్టి, అనావృష్టితో ఏయేటికాయేడు జిల్లాలోని రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలకు గురవుతున్నారు. ఈ ఏడాది అధిక శాతం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉల్లి రైతులు తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయారు.
తగ్గిన సాగు విస్తీర్ణం
వివిధ కారణాలతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఖరీఫ్‌లో దాదాపు 59 వేల హెక్టార్ల సాగు విస్తీర్ణం తగ్గింది. కర్నూలు జిల్లాలో 4.22 లక్షల హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 2.38 లక్షల హెక్టార్లు సాగు విస్తీర్ణం కాగా, కర్నూలు జిల్లాలో 3.86 లక్షలు, నంద్యాల జిల్లాలో 2.15 లక్షల హెక్టార్లలో మాత్రమే రైతులు వివిధ రకాల పంటలను సాగు చేశారు. సెప్టెంబర్ నెలలో కురిసిన అధిక వర్షాలతో పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, ఉల్లి తదితర పంటలు పూర్తి స్థాయిలో నష్టపోవడమే గాక, పంటల దిగుబడి కూడా తగ్గింది. రెండు జిల్లాల్లో దాదాపు 30 వేలకు పైగా హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. అయితే నష్టపోయిన పంటలకు పరిహారం అందించే ప్రక్రియలో పూర్తి జాప్యం చోటు చేసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మెజారిటీ మండలాల్లో నష్ట పరిహారం అందించేందుకు చేపట్టిన ఎన్యుమరేషన్ నేటికి పూర్తి కాలేదు.
ఉల్లి రైతుకు కన్నీరే మిగిలింది!
ఈ సీజన్‌లో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పండిన పంటకు గిట్టుబాటు ధర లభించక, పండిన ఉల్లిని కొనేవారు లేక రైతులు నరకయాతనను అనుభవించారు. అనేక మంది రైతులు ఉల్లి పంటను మేకలు, గొర్రెలకు వదిలి వేయగా, మరి కొందరు పంటను పూర్తిగా దున్నేశారు. మరి కొంత మంది కోసిన ఉల్లిని మార్కెట్‌కు తీసుకువచ్చినా, ఎలాంటి లాభం లేకపోవడంతో హంద్రీనీవా కాలువలో పడవేశారు. ఉల్లి రైతుల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా 2,554 మంది రైతుల వద్ద నుంచి దాదాపు 10 వేల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసింది. ఉల్లిని విక్రయించన 250 మంది రైతుల ఖాతాల్లోకి ఇప్పటి వరకు కేవలం రూ.1.50 కోట్లు మాత్రమే జమ అయినట్లు తెలుస్తోంది. ఇంకా ప్రభుత్వం రూ.16.50 కోట్లను రైతుల ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. ఉల్లిని కొనుగోలు చేసి నెల రోజులు దాటి పోయినా, నేటి వరకు నగదును జమ చేయకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 7వ తేదిన ఉదయం 11 గంటలకు స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని సమావేశ భవనంలో నిర్వహించనున్నారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ప్రధానంగా వ్యవసాయం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మత్స్య శాఖ, దేవదాయ శాఖలపై సమీక్షించనున్నారు. ఈ నేఫథ్యంలోనే ఉదయం 10 గంటలకు జెడ్పీ కార్యాలయంలోని మినీ సమావేశ భవనంలో 1వ స్థాయీ సంఘ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ప్రస్తుత రబీ సీజన్‌లో రైతులకు అందించాల్సిన శనగ విత్తనాలను కూడా ప్రభుత్వం అందించలేని పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో నెలకొనింది. కర్నూలు జిల్లాలో 46 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు అవసరం కాగా, ఇప్పటి వరకు 23 వేల క్వింటాళ్లను మాత్రమే సరఫరా చేశారు. అలాగే నంద్యాల జిల్లాలో 37 క్వింటాళ్లు అవసరమని ప్రతిపాదనలు పంపగా, కేవలం 12,654 క్వింటాళ్లు మాత్రమే సరఫరా అయ్యాయి. రైతులకు అవసరాలకు అనుగుణంగా సకాలంలో శనగ విత్తనాలను అందించక పోవడం పట్ల రైతులు బయటి మార్కెట్లపై ఆధారపడి కొనుగోలు చేశారు.
ఇళ్లకు తాళాలు వేసి, మూటాముల్లె సర్దుకుని, పిల్లాపాపలతో కలసి వాహనాల్లో దూరప్రాంతాలకు వలస వెళ్తున్న వీరు కోసిగి మండలానికి చెందిన వారు. ‘ఉపాధి’ పనులు చేసినా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవడంతో వీరు వలస బాట పట్టారు. విద్యార్థులను సైతం తమ వెంట తీసుకెళ్లడంతో గ్రామీణ ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి.
పాఠశాలల్లో గణనీయంగా తగ్గిన
విద్యార్థుల సంఖ్య
ధరల పతనంతో నష్టాల్లో
కూరుకు పోయిన ‘ఉల్లి’ రైతు
రైతులకు అందని సబ్సిడీ
శనగ విత్తనాలు
ఎల్లెల్సీ కింద
రెండో పంట సాగు కష్టమే
నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య
సమావేశం


