
తల్లిపాలు.. అమృతధారలు
● శిశువు పుట్టిన గంటలోపేతల్లి పాలివ్వాలి ● ముర్రు పాలలో వ్యాధి నిరోధక శక్తి ● బిడ్డ ఎదుగుదలకు ఎంతో మేలు ● శిశువు ఆరు నెలల వరకు ఇవే ఇవ్వాలి ● జిల్లాలో ఏటా 48 వేలకు పైగా ప్రసవాలు ● అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం
కర్నూలు(హాస్పిటల్): అప్పుడే జన్మించిన బిడ్డకు తల్లిపాలే ఆహారం. అది మనిషైనా...ఇతర ఏ జీవికైనా. జన్మించిన శిశువు తల్లిని తాకగానే ఆమెకు పాలు స్రవిస్తాయి. ఇది సృష్టి ధర్మం. ఈ ధర్మానికి వ్యతిరేకంగా ఇతర పాలను బిడ్డకు పట్టిస్తే అటు బిడ్డకు.. ఇటుకు తల్లికి అనారోగ్యం. అందుకే బిడ్డకు రెండేళ్ల వయస్సు వచ్చే వరకు తల్లిపాలే పట్టించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది బిడ్డకు, తల్లికి ఇద్దరికీ మంచిదని సెలవిస్తున్నారు. తల్లిపాల ప్రాముఖ్యత పట్ల తల్లులకు, ఆమె కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఆగష్టు ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కొత్తగా మంజూరైన మరో 12 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఇవేగాక ఐదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 26 అర్బన్‌హెల్త్ సెంటర్లు, రెండు ఏరియా ఆసుపత్రులు, ఒక బోధనాసుపత్రి ఉన్నాయి. ఆయా ఆసుపత్రుల్లో ప్రతి సంవత్సరం 48 వేలకు పైగా గర్భిణులు ప్రసవిస్తున్నారు. పుట్టిన బిడ్డకు ఎలా పాలను పట్టించాలనే విషయమై అక్కడి వైద్య సిబ్బంది బాలింతలకు సూచిస్తున్నారు. తల్లిపాల పట్ల ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో విడుదలయ్యే ముర్రుపాలను బిడ్డకు పట్టిస్తే వ్యాధినిరోధక పెరిగి భవిష్యత్‌లో రాకుండా ఉంటాయని వివరిస్తున్నారు. పనిచేసే చోట, ఉద్యోగం చేసే చోట తల్లులకు తమ బిడ్డకు పాలిచ్చేందుకు వీలు కల్పించాలి. అందుకు అందరూ సహకారం అందించాలి. ఈ మేరకు ఉన్నంతలో ఏర్పాట్లు చేయాలి.
తల్లి పాలు బాగా రావాలంటే...!
మహిళ గర్భధారణ అయినప్పటి నుంచే పోషకాలు కలిగిన పాలు, చేపలు, గుడ్లు, వెల్లుల్లిపాయ, తాజా ఆకుకూరలు, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి. ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. అతిగా స్వీట్లను తినకూడదు.
ఇవి తీసుకోరాదు
బిడ్డకు పాలిచ్చే సమయంలో తల్లి కొన్నింటిపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలి. బిడ్డను పడుకోబెట్టి, నిలబెట్టి పాలు పట్టకూడదు. పాలిచ్చే సమయంలో కెఫిన్ అధికంగా ఉండే పదార్థాలు, శీతల పానియాలు తీసుకోకూడదు ఇది శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది.
ముర్రుపాలలో రోగ నిరోధక శక్తి
గర్భిణి ప్రసవించిన అనంతరం మొదటి అరగంటలోపు తల్లికి వచ్చే పాలను ముర్రుపాలంటారు. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మంది అవగాహన లేకపోవడం వల్ల బిడ్డకు ముర్రుపాలను తాగించడంలో నిర్లక్ష్యం వహిస్తారు. ఈ పాలలో వ్యాధి నిరోధకశక్తిని పెంచే గుణం ఉంటుంది. సమతుల్యమైన పోషకాహార పదార్థాలు అందజేస్తాయి. చాలా రకాల వ్యాధులు రాకుండా తల్లిపాలు కాపాడతాయి. తల్లికి, శిశువుకు జ్వరం వచ్చినప్పుడు, టీకాలు ఇచ్చినప్పుడు కూడా పాలు పట్టించవచ్చు. తల్లిపాలు తాగే పిల్లల్లో ఆకస్మిక మరణాలు తక్కువేనని వైద్యులు చెబుతున్నారు.
ఎప్పుడు..ఎలా పాలివ్వాలంటే...
ఉపయోగాలు
శిశువుకు తల్లిపాలు సంపూర్ణమైన సంతులిత ఆహారాన్ని అందిస్తాయి.
ఇవి నాణ్యమైన ప్రొటీన్లు, ఒమెగా 3, ఒమెగా 6, ఒమెగా 9, విటమిన్లు ఉండి బిడ్డ మెదడుకు వికాసానికి తోడ్పడుతాయి. లాక్టోజుతో కాల్షియం నిల్వలు పెరుగుతాయి. బిడ్డను రక్తహీనత నుంచి కాపాడుతాయి.
తొలి నెలలో శిశువులకు వివిధ రకాల అంటువ్యాధుల బారి నుంచి కాపాడుతాయి. డయేరియా, నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధుల రాకుండా నిరోధిస్తాయి. క్యాన్సర్, చెవికి సంబంధించిన వ్యాధులు, గుండెవ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
అలర్జి, ఆస్తమా, డయాబెటీస్ వంటి వ్యాధులూ రావు
బాల్యంలో, యవ్వనంలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువ.
తల్లిపాలు ఎంతో స్వచ్ఛంగా, ఎలాంటి క్రిములు లేకుండా ఉంటాయి. శ్వాసకోశ, అలర్జి, ఆస్తమా, చర్మవ్యాధుల నుంచి బిడ్డలను రక్షిస్తాయి. బిడ్డ మానసిక, శారీరక వికాసానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. అందుకే బిడ్డ జన్మించిన గంటలోపు తల్లికి వచ్చే ముర్రుపాలు పట్టించాలి. ఆ తర్వాత ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప మరే పదార్థాలూ ఇవ్వకూడదు. రోజులో 8 నుంచి 10 సార్లు లేదా ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలి. ఆరు మాసాల తర్వాత తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఇవ్వాలి. రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా పాలు పట్టాలి.