
దర్జాగా ఇసుక దందా
● వాహన యజమానులకు టీడీపీ నేతల బెదిరింపులు ● టన్ను ఇసుక రూ. 500కే తమకివ్వాలని ఒప్పందం ● అక్రమంగా ఇసుక డంప్ చేసి వ్యాపారం
డోన్: ఇసుక ఉచితంగా అందిస్తామని.. భవన నిర్మాణ రంగాన్ని గాడిలో పెడతామని హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పడు దర్జాగా ఇసుక దందాకు పాల్పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇసుక తెచ్చి స్థానికంగా డంప్ చేసి అక్రమ వ్యాపారం చేస్తున్నా రు. ప్రతి నెల లక్షలాది రూపాయలు అక్రమార్జన చేస్తున్నారు. డోన్, బేతంచెర్ల చుట్టు పక్కల ప్రాంతాల నుంచి అనంతపురం జిల్లా పామిడి, తాడిపత్రితో పాటు నెల్లూరు జిల్లాకు వివిధ ఖనిజాలను లారీల్లో తరలిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో పెన్నా నది ఇసుకను టన్ను రూ.220 చొప్పున కొనుగోలు చేసి డోన్, బేతంచెర్ల, ప్యాపిలి మండలాల్లో టన్ను రూ.550 చొప్పున విక్రయిస్తుండేవారు. ఈ క్రమంలో అధికార పార్టీ నేతల కళ్లు ఇసుక అక్రమ రవాణాపై పడింది. కొత్తబస్టాండ్ సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఇసుక రవాణా చేసే టిప్పర్, లారీ యజమానులందరినీ సమావేశ పరిచి టన్ను ఇసుక రూ.500 ప్రకారం తెచ్చి ఇవ్వాలని హుకుం జారీ చేశారు. అదే ఇసుకను భవన నిర్మాణ యజమానులకు టన్ను రూ.900 చొప్పున అమ్ముకుంటామని లేదంటే, పోలీసుల ద్వారా వేధింపులు అధికం చేయడమే కాక ఆర్థికంగా నష్టపోయేట్లు చేస్తామని హెచ్చరించారు. దీంతో టిప్పర్, లారీ కిరాయి, డ్రైవర్ బత్తా, డీజల్ అన్ని కలిపి టన్ను ఇసుక రూ.550కు ఇచ్చేందుకు అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం స్థానిక బట్టీల సెంటర్‌లోని ధర్మవరం రోడ్డులో మూతపడిన గ్రానైట్ ఫ్యాక్టరీ ఆవరణలో అధికార పార్టీ నేతలు ఇసుక డంప్ ఏర్పాటు చేసి దోపిడీకి రంగం సిద్ధం చేశారు. సామాన్యుడు తమ గృహ నిర్మాణాలకు ఎడ్లబండ్లు, ఆటోలలో ఇసుక తరలిస్తే పట్టుకొని వేధించే రెవెన్యూ, పోలీసు, ఏడీఎంఈ అధికారులు అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఇసుక డంప్ గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.