
కుటుంబ నియంత్రణకు రాం రాం..!
కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2011 లెక్కల ప్రకారం 44లక్షల జనాభా ఉంది. ప్రస్తుతం ఈ సంఖ్య 50 లక్షలకు చేరి ఉంటుందని అంచనా. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భూమి పెరగడం లేదు. పెరిగిన వారికి ఆహారం, చదువు, ఉద్యోగం, ఆర్థిక అవసరాలు తీర్చడం కష్టంగా మారుతోంది. ఈ ఉద్దేశంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నాళ్లుగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ప్రోత్సహించాయి. కు.ని ఆపరేషన్ చేయించుకున్న వారికి నగదుతో పాటు స్వచ్ఛంద సంస్థలచే బహుమతులూ ప్రదానం చేసిన కాలాలు ఉన్నాయి. కాగా ఇటీవల రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం జనాభా పెంచాలని ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో జననాల రేటు రెండు కంటే తక్కువగా ఉందని, ఇకపై ప్రతి జంటా ముగ్గురికి పైగా కనాలని, వారిని పోషించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ఇందుకు అవసరమైన ప్రోత్సాహకాలను ఇస్తామని ప్రచారం చేస్తోంది. అయినా సరే జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేయించుకునే వారి సంఖ్య తగ్గలేదు. పైగా జననాల రేటు సైతం గణనీయంగా పడిపోతూ వస్తోంది. గత సంవత్సరం రాష్ట్ర సగటు 1.21 ఉండగా కర్నూలు జిల్లాలో 1.80, నంద్యాల జిల్లాలో 1.36 మాత్రమే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కుటుంబ నియంత్రణ లక్ష్యాలను అధికారులు విధించడం మానేశారు. వచ్చిన వారికి మాత్రం ఆయా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆపరేషన్‌లు చేస్తున్నారు. ఇదే క్రమంలో బిడ్డకు బిడ్డకు మధ్య ఎడమ ఉండేందుకు, తద్వారా తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు గాను తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి ప్రచారం చేస్తున్నారు. ఆసుపత్రులకు వచ్చిన గర్భిణులు, బాలింతలకు ఈ విషయంపై వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పీపీ యూనిట్, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలోని పీపీ యూనిట్, ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రి, నంద్యాల జిల్లా ఆసుపత్రి, కోడుమూరు, ఓర్వకల్, పత్తికొండ, వెల్దుర్తి, ఆలూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో నిర్వహిస్తున్నారు. అలాగే హోంలోనూ రెండు కాన్పులు అయిన వెంటనే కు.ని చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
తాత్కాలిక కుటుంబ
నియంత్రణపై ప్రచారం
శాశ్వత కుటుంబ నియంత్రణను పక్కన పెట్టి తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులపై వైద్య ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. ఈ మేరకు కర్నూలు, నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలల్లో ప్రసవానంతరం వెంటనే ‘అంతర’ ఇంజెక్షన్లు బాలింతలకు ఇస్తున్నారు. ఇది కూడా బాలింత, ఆమె కుటుంబసభ్యుల అనుమతి తీసుకుని మాత్రమే ఇస్తున్నారు. దీనివల్ల మళ్లీ మూడేళ్ల వరకు మహిళ గర్భం దాల్చకుండా ఉంటుంది. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్కీడిప్ నిర్వహించనున్నారు. ఇందులో ముగ్గురి కంటే ఎక్కువ మంది పిల్లలను కన్న దంపతులకు ఒక్కొక్కరికి రూ.5వేలు, పీపీ ఐయుసీడీ, వేసక్టమి ఆపరేషన్, ఆంత్రా ఇంజెక్షన్ చేయించుకున్న వారికి ఒక్కొక్కరికి రూ.5వేలు, బెస్ట్ గైనకాలజిస్టు (పీపీ ఐయుసీడీ ప్రోత్సహించిన వారికి) రూ.8వేలు, బెస్ట్ వేసక్టమి సర్జన్‌కు రూ.7వేలు, పీపీఐయుసీడీ ప్రోత్సహించిన ఆర్‌ఎంఎన్‌సీహెచ్ కౌన్సిలర్‌కు రూ.2,500లు, ఏఎన్‌ఎంకు రూ.2,500లు, ఆశాకు రూ.2,500లు, సీహెచ్‌వో/ఎంఎల్‌హెచ్‌పీలకు రూ.2,500లు ఇవ్వనున్నారు.
నేడు కర్నూలులో భారీ ర్యాలీ
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 11వ తేదీన కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించనున్నాం. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి మెడికల్ కాలేజి వరకు, అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు అవగాహన ర్యాలీ కొనసాగుతుంది. వెంట వెంటనే పిల్లలను కనకుండా తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులపై ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణి ప్రతి బిడ్డ బిడ్డకు మూడేళ్లు ఎడమ ఉంటే తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు.
– డాక్టర్ పి. శాంతికళ, డీఎంహెచ్‌వో, కర్నూలు
లాప్రోస్కోపిక్‌తో
ట్యూబెక్టమి ఆపరేషన్
జిల్లాలో చాలా మంది అమ్మాయిలు ఎక్కువగా పుడుతున్నార ని ముగ్గురు, నలుగురిని ప్రసవించేందుకు సిద్ధమవుతున్నారు. రెండో కాన్పునకు వచ్చిన వారికి కుటుంబ నియంత్రణపై చెప్పి ట్యూబెక్టమి చేయించుకునేలా చెబుతున్నాం. ఇప్పుడు పెద్దగా కోత లేకుండా లాప్రోస్కోపిక్ విధానంలోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునే అవకాశం వచ్చింది. అది కూడా పేదలైతే ఆరోగ్యశ్రీలో చేయించుకోవచ్చు.
– డాక్టర్ కె.శృతి, గైనకాలజిస్టు, కర్నూలు
కు.ని లక్ష్యాన్ని వదిలేసిన ప్రభుత్వం
వచ్చిన వారికి మాత్రమే ఆపరేషన్లు
తాత్కాలిక గర్భనిరోధంపై అవగాహన
నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
ఏడేళ్లుగా కుటుంబ నియంత్రణ కార్యక్రమం
సంవత్సరం లక్ష్యం లక్ష్య సాధన
2018-19 25,000 17,569
2019-20 25,000 16,556
2020-21 25,000 7,728
2021-22 14,058 7,575
2022-23 12,885 9,497
2023-24 12,885 8,836
2024-25 12,885 9,824

కుటుంబ నియంత్రణకు రాం రాం..!

కుటుంబ నియంత్రణకు రాం రాం..!