కర్నూలు సిటీ: ఇంటర్మీడియేట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారిగా జి.లాలెప్పను నియమిస్తూ శుక్రవారం ఇంటర్మీడియెట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ప్రాంతీయ కార్యాలయ అధికారిగా సి.సురేష్ బాబు పని చేస్తున్నారు. ఈయనకు త్వరలోనే ఇంటర్మీడియేట్ బోర్డు ఆర్జేడీగా పదోన్నతి రానుండడంతో ఆయన స్థానంలో కెవిఆర్ బాలిలక జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్‌గా పని చేస్తున్న జి.లాలెప్పకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన శుక్రవారం సాయంత్రం ఆర్‌ఐఓగా విధుల్లో చేరారు. లాలెప్ప 1998లో గణితం అధ్యాపకులుగా ఉద్యోగంలో చేరి గుంతకల్లు, ఓర్వకల్లు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేశారు. 2013లో అధ్యాపకుడి నుంచి ప్రిన్సిపాల్‌గా పదోన్నతి పొందారు. కెవిఆర్ కాలేజీ ప్రిన్సిపల్‌గా పని చేస్తూ అనంతపురం కేఎస్‌ఆర్ జూనియర్ కాలేజీకి బదిలీ అయ్యారు. ఆ తరువాత కర్నూలు కెవిఆర్ బాలికల కాలేజీకి బదిలీపై వచ్చి ప్రస్తుతం అక్కడే పని చేస్తున్నారు.
గోడ కూలి బాలుడి మృతి
పాణ్యం: మండల పరిధిలోని తొగర్చేడు గ్రామంలో పాతగోడ కూలి ఐదేళ్ల బాలుడు మరణించాడు. ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపిన వివరాలివీ.. గ్రామానికి చెందిన కరిముల్లాకు ఇద్దరు కుమార్తెలు సంతానం. మొదటి కుమార్తె షాహిన్‌కు పెద్దకొప్పెర్లకు చెందిన మాబాషాతో వివాహమైంది. వీరికి మహ్మద్ హారిఫ్(5)తో పాటు తమ్ములు, చెల్లెలు సంతానం. శుక్రవారం కరిముల్లా కూలీ పనులకు వెళ్తుండగా ఆయనతో పాటు హారిఫ్ కూడా వెంట వెళ్లాడు. ఇదే గ్రామానికి చెందిన నాగేశ్వరరెడ్డికి సంబంధించి పాతమిద్దెను తొలగిస్తున్నారు. పై నుంచి తొలగించేందుకు కట్టెలతో సార్వ వేసుకున్నారు. గోడలు పాతబడడంతో సార్వ, గోడ కూలిపోయింది. అప్పటికే తాత వెంట వచ్చిన మహ్మద్ హారిఫ్ గోడ వద్దనే ఉన్న విషయాన్ని గమనించలేదు. సార్వపై ఉన్న కరిముల్లా, శేషిరెడ్డితో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు బాలుడి కోసం వెతుకుతూ రాళ్లను తొలగిస్తుండగా వాటి మధ్య రక్తపు మడుగులో కనిపించాడు. వెంటనే నంద్యాల జీజీహెచ్‌కు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
ఆర్‌ఐఓగా జి.లాలెప్ప