
ఆగస్టు 27 నుంచి గణేశ్ మహోత్సవాలు
కర్నూలు కల్చరల్: వినాయక చవితి ఉత్సవాలు ఆగస్టు 27వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి జిల్లా సంఘటనా కార్యదర్శి డాక్టర్ నాగఫణి శాస్త్రి వెల్లడించారు. ఆదివారం వినాయక ఘాట్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, పత్తికొండ, గూడూరు, ఇతర పట్టణా ల్లో ఆగస్టు 27 నుంచి 31వ తేదీ వరకు వినాయక చవితి ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయన్నారు. కర్నూలు నగరంలో ఈఏడాది 44వ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నామన్నారు. సెప్టెంబర్ 4వ తేదీ వరకు 9 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయన్నారు. గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, గోరంట్ల రమణ మాట్లాడుతూ.. వేడుకల్లో మట్టివినాయక విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవ సమితి కార్యాధ్యక్షులు డాక్టర్ మోక్షేశ్వరుడు, కోశాధికారి ఏవీ ప్రసాద్, కర్నూలు నగర ఉత్సవ సమితి అధ్యక్షులు రంగస్వామి, ప్రధాన కార్యదర్శి గిరిరాజ వర్మ తదితరులు పాల్గొన్నారు.