
మంత్రి, ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యలు పట్టవా?
● కర్నూలులో మంచినీరు
ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు
● వైఎస్సార్‌సీపీ కర్నూలు, నంద్యాల
జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి,
కాటసాని రాంభూపాల్ రెడ్డి
కర్నూలు (టౌన్): కర్నూలులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి స్పందించడం లేదని వైఎస్సార్‌సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీమోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో నగర మేయర్ బీవై రామయ్య, డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, నగరపాలక స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లతో కలిసి ఆదివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా మూడు నియోజకవర్గాల ఉన్న కర్నూలులో అభివృద్ధి పనులు చేయలేదన్నారు. కర్నూలులో మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి ఉన్నా.. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయన్నారు. ఆరు నెలల వ్యవధిలో కమిషనర్, ఎస్‌ఈ బదిలీ తప్ప చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధి పనులకు టెండర్లు వేయకుండా, కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూ రు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్లు 57 రోజులుగా సమ్మెలో ఉండటంతో జీతాలు పెంచుతామని బూట కపు హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. మరోసారి వారు సమ్మెలోకి వెళ్తున్నారన్నారు. కర్నూలులో మంచినీరు ఎప్పు డు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. నగరంలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారిందన్నారు.
కర్నూలులో కనిపించని అభివృద్ధి
వైఎస్సార్‌సీపీ హయాంలో కర్నూలు కార్పొరేషన్‌లో రూ.700 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశామని కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా అభివృద్ధి కనిపించడంలేదన్నారు. ప్రజల గృహాలను కూల్చే ప్రయత్నాలు తప్ప కల్లూరు అభివృద్ధి పట్టదా అని ప్రశ్నించారు. రూ. కోట్లు వెచ్చించి ప్రజల కోసం ఏర్పాటు చేసిన పార్కులు, స్టేడియాలు నేడు మూత పడ్డాయన్నారు. స్ట్రీట్ మార్కెట్లు వెలవెలబోతున్నాయన్నారు. ట్రాఫిక్ సమస్య మళ్లీ మొదటికి వచ్చిందన్నారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు విక్రమ సింహారెడ్డి, జుబేర్, షేక్ అహమ్మద్, షేక్ యూనుస్ బాషా, మహిళా కార్పొరేటర్లు సిట్రా సత్యనారాయణమ్మ, షేక్ ఆర్షియా పర్వీన్, మిద్దె చిట్టెమ్మ, పల్లవి, అరుణ, రాజేశ్వర రెడ్డి, నారాయణ రెడ్డి, దండు లక్ష్మీకాంత రెడ్డి, కృష్ణకాంత్, రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, సాంబశివరావు, పార్టీ నేతలు పాల్గొన్నారు.