రైతులంటే ఇంత చులకనా? | - | Sakshi
Sakshi News home page

రైతులంటే ఇంత చులకనా?

Jul 15 2025 6:21 AM | Updated on Jul 15 2025 6:21 AM

రైతులంటే ఇంత చులకనా?

రైతులంటే ఇంత చులకనా?

ఆదోని టౌన్‌: ‘ రేయింబవళ్లు కష్టపడి పంటలు పండిస్తే కనీసం ధర ఇవ్వరా? రాష్ట్ర ప్రభుత్వానికి, పొగాకు కంపెనీలకు రైతులంటే ఇంత చులకనా’ అంటూ కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాకు రూ.18,500 ఇస్తామని చెప్పి అతి తక్కువకు కొనుగోలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆదోని మండలం ఢణాపురం గ్రామంలో సోమవారం ఓ కంపెనీ పొగాకును కొనుగోలు చేశారు. పొగాకు నాణ్యత లేదని, రంగు మారిందని, నల్లబడిందని చెబుతూ క్వింటా రూ. 4,000 నుంచి రూ.3,500 మొదలుకొని రూ.6 వేలకు మించకుండా కొనుగోలు చేయడంతో రైతులు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం, కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలతో పొగాకును తీసుకెళ్లిన రైతులు గిట్టుబాటు ధర రాకపోవడంతో నిరుత్సాహం చెందారు. ఇష్టానుసారంగా ధరలు తగ్గించి పొగాకు రైతులను నట్టేట ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): రెక్కల కష్టాన్ని నమ్ముకున్న రైతులకు పెద్ద కష్టం వచ్చింది. ఇంటి నిండా పొగాకు బేళ్లు ఉన్నా కొనేవారు లేరు. పంట సాగుకు ముందు ఒప్పందం చేసుకున్న కంపెనీలు మౌనం వహిస్తున్నాయి. రైతులకు అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. నష్టాన్ని భరించలేక కొందరు రైతులు గుండెపోటుతో హఠాన్మరణానికి పాల్పడుతున్నారు. ఇంటింటా ‘బేళ్ల’ చూపులు కనిపిస్తున్నా పాలకులు స్పందించడం లేదు. కర్షకుడి గుండెకు ధైర్యాన్ని ఇవ్వాలనే విషయాన్నే మరచిపోయారు.

కొను‘గోల్‌మాల్‌’

గతేడాది కర్నూలు జిల్లాలో 36,471, నంద్యాల జిల్లాలో 30,865.. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 67,336 ఎకరాల్లో పొగాకు సాగు చేశారు. పంట చేతికి వచ్చి 10 నెలలు అవుతోంది. బోర్డు అధికారులు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం, అన్ని గ్రేడ్‌ల పొగాకు బేళ్లను కొనుగోలు చేయక పోవడంతో రైతుల ఇళ్లల్లో గుట్టలుగా ఉన్నాయి. గతేడాదికి సంబంధించి పొగాకు కంపెనీల అసోసియేషన్‌ క్వింటాకు రూ.15,500 ధర నిర్ణయించింది. అయితే పొగాకు కంపెనీలు గరిష్టంగా రూ.8,000 మాత్రమే ధర ఇస్తున్నాయి. దీంతో రైతులు నష్టాలు మూట కట్టుకుంటున్నారు. కొనుగోళ్ల ప్రక్రియ మార్చిలోపే పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటికీ పొగాకు నిల్వలు రైతుల ఇళ్లల్లో ఉండిపోయాయి.

స్పందించని రాష్ట్ర ప్రభుత్వం

పొగాకు సాగు చేసి నష్టాలు మూట కట్టుకుంటున్న రైతులకు చేయూత ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. కంపెనీలతో, ప్రభుత్వరంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్‌, నాఫెడ్‌ల ద్వారా మద్దతు ధరతో పొగాకును కొనే ఏర్పాటు చేయాల్సి ఉంది. కాని ఇవేమీ పట్టించుకోకుండా మిన్నకుండి పోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. కంపెనీల ఒప్పందంతో రైతులు పొగాకు సాగు చేసినా అవి కొనుగోలు చేయడం లేదు.కంపెనీల మెడలు వంచి కొనిపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నా స్పందించడం లేదు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ మొదలై దాదాపు రెండు నెలలవుతున్నా గతేడాది పండించిన పంటనే అమ్ముకోలేని దుస్థితి ఏర్పడింది.

పొగాకు సాగు వద్దు బాబోయ్‌..

పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ముగ్గురు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. పొగాకు దిగుబడిని అమ్ముకోలేకపోవడం, నష్టాలు రావడంతో ఇటీవల నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలం ఎర్రగుంట్ల గ్రామంలో రైతు బొబ్బలి రమణ రెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. అయినా రాష్ట్రప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ ఏడాది పొగాకు సాగుకు రైతులు ఉత్సాహం చూపడం లేదు. ఇప్పటికే ఐటీసీ కంపెనీ అగ్రిమెంటు చేసుకునేందుకు ముందుకు వచ్చినా రైతుల నుంచి స్పందన లేదు. మిగిలిన కంపెనీల జాడ లేకుండా పోయింది. గతేడాది పొగాకు సాగు చేసిన రైతులు ప్రస్తుతం పత్తి, మొక్కజొన్న తదితర పంటల వైపు వెళ్లారు.

అమ్మకానికి పొగాకు బేళ్లను తీసుకొచ్చిన రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement