
20 రోజులకోసారి మంచినీరు!
ఆలూరు రూరల్: జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రాలకు 15 రోజులకు ఒక సారి మంచి నీరు సరఫరా అవుతోంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు 20 రోజులకోసారి మంచినీరు ఇస్తున్నారు. ఆలూరు మండలంలోని అరికెర గ్రామానికి 18 రోజుల తర్వాత సోమవారం మంచినీరు వదిలారు. గ్రామంలో ఇంటింటి కుళాయిలు లేవు. గ్రామస్తులు తోపుడు బండ్ల సహాయంతో పబ్లిక్ కుళాయిల వద్దకు వెళ్లి మంచినీరు తెచ్చుకున్నారు. హాలహర్వి మండలం విరుపాపురం రిజర్వాయర్ నుంచి అరికెర గ్రామానికి తాగునీరు సరఫరా అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సకాలంలో మంచినీరు సరఫరా చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
అభిషేకం చేయిస్తానని డబ్బులు వసూలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మల్లికార్జున స్వామికి అభిషేకం చేయిస్తానని భక్తులను మోసం చేసిన వ్యక్తిని ఆలయ ఏఈవో హరిదాసు పట్టుకున్నారు. సోమవారం శ్రీశైలంకు చెందిన పవన్ అనే వ్యక్తి ఆరుగురు భక్తులను మల్లికార్జున స్వామివారికి అభిషేకం చేయిస్తానని వారి వద్ద నుంచి రూ.15వేలు తీసుకున్నట్లు సమాచారం. సదరు వ్యక్తి రూ.300 టికెట్లను ఒక్కొరికి రెండు చొప్పున ఆరు తీసుకుని దర్శనానికి వెళ్లాడు. అక్కడ భక్తులను విచారించగా తమ వద్ద రూ.15 వేలు డబ్బులు తీసుకున్నట్లు వారు ఏఈవో దృష్టికి తీసుకువచ్చారు. దీంతో పవన్‌ను సీఎస్‌వోకి అప్పగించారు. ఆయన విచారించి శ్రీశైలం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తిరుమలకు ప్రత్యేక ప్యాకేజీ
కర్నూలు కల్చరల్: ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో తిరుమలకు ప్రత్యేక ప్యాకేజీ టూర్ ఏర్పాటు చేసినట్లు ఏపీటీడీసీ డీవీఎమ్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వారంలో రెండు రోజులు ఏపీటీడీసీ తిరుమలకు ప్యాకీజీతో బుస్ బయలు దేరుతుందని తెలిపారు. ప్రతి మంగళవారం, శుక్రవారం కర్నూలు నుంచి నంద్యాల మీదుగా తిరుమలకు ట్విన్ షేరింగ్ నాన్ –ఏసీ బస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కర్నూలు నుంచి తిరుమలకు రూ. 2,670, నంద్యాల నుంచి తిరుమలకు రూ.2,470 ప్యాకేజీ ఛార్జీ ఉంటుందని పేర్కొన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలకు పూర్తిగా ఉచితమ న్నారు. తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు క్షేత్రాలు ప్యాకేజీలో ఉన్నాయని తెలిపారు. కర్నూలు వెంకట రమణ కాలనీలోని ఏపీటీడీసీ కార్యాలయం నుంచి బస్సు బయలు దేరుతుందని తెలిపారు. కొత్త బస్టాండ్, మెడికల్ కళాశాల సమీపం, నంద్యాల చెక్‌పోస్ట్ ప్రాంతాల్లో పికప్ పాయింట్లు ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలకు ఏపీటీడీసీ కార్యాలయాన్ని సందర్శించాలన్నారు.