
వానదేవా.. కరుణించు!
కొత్తపల్లి: వానదేవా కరుణించు.. అంటూ ఎర్ర మఠం గ్రామస్తులు సోమవారం సంగమేశ్వరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎగువ పుష్కరఘాట్ వద్ద ఉన్న ఉమామహేశ్వరాలయంలో శివలింగానికి, లలితాదేవి, గంగాదేవికి 101 బిందెలతో కృష్ణా జలాలు తెచ్చి జలాభిషేకం చేశారు. ఖరీఫ్ సీజన్‌లో రైతన్నలు సాగుచేసుకున్న మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ ఇతర పంటలు వర్షాలులేక ఎండిపోయే దుస్థితి నెలకొంది. దీంతో వానలు కురవాలని ప్రజలు పూజలు చేస్తున్నారు.
వర్షం కోసం కప్పల ఊరేగింపు
కొలిమిగుండ్ల: వర్షాలు కురవాలని కొలిమిగుండ్లలో సోమవారం గ్రామస్తులు కప్పలతో ఊరేగింపు నిర్వహించారు. పొడవాటి కర్రకు మధ్యలో కప్పలను వేలాడదీశారు. కుండలో పసుపు, కుంకుమ కలిపిన నీళ్లు పోసి డప్పు వాయిద్యాలతో ఊర్లోని పలు వీధుల్లో ఊరేగింపు చేస్తు ఇంటింటి వద్ద ధాన్యం సేకరించారు. సాయంత్రం గంగమ్మకు పూజలు నిర్వహించారు. వర్షాలు కురవక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాన దేవుడు కరుణించాలనే ఉద్దేశంతో పాత కాలపు ఆచారాన్ని చేపట్టామన్నారు. ఈవిధంగా చేయడం వల్ల వర్షాలు కురుస్తాయని నమ్మకంతో చేశామని నిర్వాహకులు తెలిపారు.
కుందూలో పడి మహిళ మృతి
ఉయ్యాలవాడ: ప్రమాదవశాత్తూ ఓ మహిళ కుందూనదిలో పడి మృత్యువాత పడింది. ఉయ్యాలవాడ, రూపనగుడి గ్రామాల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. సంజామల మండలం కమలపురి గ్రామానికి చెందిన దాసరి వెంకటలక్షమ్మ(57)కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కుటుంబీకులు భూత వైద్యం కోసం ఆదివారం రాత్రి ఉయ్యాలవాడలోని ఓ మహిళ దగ్గరకు తీసుకొచ్చారు. ఆ తర్వాత కుమారుడు బాల వెంకటేశ్వర్లు, తల్లి వెంకటలక్ష్మమ్మలు ఓ బైక్‌పై తిరుగుప్రయాణమయ్యారు. మార్గమధ్యలో రూపనగుడి వద్ద కుందూ బ్రిడ్జిపై వెళ్తుండగా వెంకటేశ్వర్లు కంటిలో పురుగు పడింది. ఈ క్రమంలో అతను కళ్లు మూసుకుని నలుపుతుండగా బైక్ ప్రమాదవశాత్తూ నదిలోకి దూసుకెళ్లింది. వెనుక బైక్‌పై వస్తున్న మరో కుమారుడు, కోడలు గమనించి కేకలు వేశారు. నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో అటుగా వెళ్తున్న వాహనదారులు వెంకటేశ్వర్లు, వెంకటలక్ష్మమ్మను బయటకు తీశారు. కొన ఊపిరితో వున్న వెంకటలక్ష్మమ్మను 108లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు ఏఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. కుందూనదిలో పడిన బైక్‌ను ఉయ్యాలవాడకు చెందిన మత్స్యకారుల సహకారంతో సోమవారం పోలీసులు బయటకు తీశారు.

వానదేవా.. కరుణించు!

వానదేవా.. కరుణించు!