
కర్నూలు జిల్లా: 16 ఏళ్ల పాటు సీఎంగా ఉండి రాయలసీమలో ఏ ప్రాజెక్ట్ చేపట్టారో చంద్రబాబు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎంతో అనుభవం ఉన్న నాయకుడిగా చెప్పుకునే చంద్రబాబు.. రాయలసీమ ప్రాజెక్టులు గురించి ఎప్పుడూ పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్టీఆర్ హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టును ప్రారంభించగా, ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ కాలం సీఎంగా పని చేసిన చంద్రబాబు.. ప్రాజెక్టును పూర్తి చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. 1998లో జీవో హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మించలేమని చెప్పి.. కేవలం త్రాగునీటి కోసం ఈ ప్రాజెక్టును వాడుకోవాలని జీవో విడుదల చేశారన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక ఎన్టీఆర్ చేపట్టిన తెలుగు గంగ ప్రాజెక్టును పూర్తి చేసి హంద్రీనీవా ప్రాజెక్ట్ నుంచి 40 టీఎంసీలు తీసుకోవాలని రెండు ఫేస్‌లుగా విభజించారన్నారు. అనంతపురం కరువు నుంచి బయట పడింది అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చలవేనని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఆయన చేపట్టిన ప్రాజెక్ట్ ద్వారా కియా పరిశ్రమకు నీరు అందుతున్నదని, ఇప్పుడు వైఎస్సార్ పేరు చెప్పకుండా తానే మొత్తం చేస్తున్న అని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో వైఎస్సార్ పని చేశారని, 98లో మీరు ఇచ్చిన జీవో, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన జీవో గురించి చర్చించడానికి మీరు, మీ నాయకులు సిద్ధమా? అని శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు.
చంద్రబాబుకు చిత్త శుద్ధి ఉంటే గుండ్రేవుల, వేదవతి, రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేస్తామని చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమను రత్నాల సీమ చేస్తానని మాట్లాడుతున్న చంద్రబాబు.. కర్నూలులో హైకోర్టు ఎందుకు వద్దన్నారని, ఇక్కడ ఉన్న లా యూనివర్సిటీ ఎందుకు తరలించారని ప్రశ్నించారు.