
జల్సాల కోసం ‘దోపిడీ’ బాట
● ముగ్గురిని అరెస్టు చేసిన
పోలీసులు
● అరెస్టు అయిన వారిలో
ఇద్దరు మైనర్లు
● బాల నేరస్తుల
శరణాలయానికి అప్పగింత
కర్నూలు: ఉన్నత విద్య అభ్యసించి కుటుంబానికి అండగా ఉండాల్సిన వారు మద్యానికి, జల్సాలకు అలవాటు పడ్డారు. ఇందుకు కావాల్సిన డబ్బుల కోసం ‘దోపిడీ’ బాట పట్టారు. కారులో ప్రయాణికులను ఎక్కించుకుని దోపిడీకి పాల్పడుతూ పోలీసులకు పట్టుబట్టారు. కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్ తెలిపిన వివరాలు.. దేవనకొండ మండలం తెర్నేకల్లు గ్రామానికి చెందిన జొహరాపురం నూర్ బాషా ఈనెల 5వ తేదీ తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి కర్నూలు చేరుకున్నాడు. స్వగ్రామానికి వెళ్లేందుకు కర్నూలు లోని బళ్లారి చౌరస్తా వద్ద నిలబడి ఉన్నాడు. కర్నూలు వాసవీనగర్‌కు చెందిన రమేష్ (20), కర్నూలు అశోక్ నగర్, గీతా నగర్‌కు చెందిన మరో ఇద్దరు మైనర్లు కారులో వచ్చి తాము బళ్లారికి వెళ్తున్నాం అంటూ నూర్‌బాషాను ఎక్కించుకున్నారు. తొలుత రూ.100 అవుతుందని నమ్మించారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత చంపుతామని బెదిరించి రూ.6,500 నగదు, సెల్‌ఫోన్, ఏటీఎం కార్డు, పాన్ కార్డు, క్రెడిట్ కార్డు బలవంతంగా లాక్కున్నారు. ఫోన్ పే నంబర్ తెలుసుకుని మరో రూ.12,000 అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. నెరవాడ గ్రామ సమీపంలో కారు నుంచి బయటకు తోసేసి వెళ్లిపోయారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగలాపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని పక్కా అధారాలతో కల్లూరు మండలం లక్ష్మీ జగన్నాథగట్టు కోనేరు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్ ఎదుట హాజరుపర్చారు. కర్నూలు రూరల్ తాలూకా సీఐ చంద్రబాబు నాయుడు, నాగలాపురం ఎస్‌ఐ శరత్ కుమార్ రెడ్డితో కలసి డీఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నిందితులు తాగుడు, జల్సాలకు అలవాటు పడి ఖర్చుల కోసం ప్రయాణికులను తమ కారులో ఎక్కించుకుని దోపిడీకి పాల్పడేవారని తెలిపారు. ఇందులో ఇద్దరు మైనర్లు ఉండటంతో బాల నేరస్తుల శరణాలయానికి అప్పగించినట్లు తెలిపారు. నిందితుల నుంచి దోపిడీ సొమ్ము రూ.11,800, నేరానికి ఉపయోగించిన కారును సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.