
స్క్వాడ్ వస్తోంది.. జాగ్రత్త !
● డీలర్లకు ముందుగా సమాచారం ఇస్తున్న వ్యవసాయ సిబ్బంది ● తూతూ మంత్రానికే పరిమితం అవుతున్న తనిఖీలు ● యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్న వైనం ● కౌతాళంలో ఆర్‌బీకే ఎరువులపై ప్రైవేటు డీలరు పెత్తనం
కర్నూలు(అగ్రికల్చర్): ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల విక్రయాలపై ఆకస్మిక తనిఖీలకు వచ్చిన టీమ్‌లు వివిధ మండలాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే సంబంధిత వ్యవసాయ సిబ్బంది ముందుగానే ‘స్క్వాడ్ వస్తోంది.. జాగ్రత్తగా ఉండాలని ఉప్పందిస్తుండటంతో డీలర్లు, అక్రమార్కులు అప్రమత్తం అవుతున్నారు. జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేపట్టేందుకు రెండు బృందాలు వచ్చాయి. ఇందులో వివిధ జిల్లాలకు చెందిన ఏడీఏలు, విజిలెన్స్ అధికారులు ఉన్నారు. ఆకస్మికంగా తనిఖీలకు వెళితే అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. జిల్లాలో కొన్ని మండలాల్లో ప్రైవేటు డీలర్లు యూరియాను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. కౌతాళంలోని ఓ ఆర్‌బీకేలో 600 బస్తాల యూరియా ఉంది. ఆర్‌బీకేకు వచ్చిన యూరియాపై ఓ ప్రైవేటు డీలరు పెత్తనం చెలాయిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిసై రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మా షాపులో మందులు, విత్తనాలు తీసుకోవడం లేదు. అలాంటప్పుడు మీకు యూరియా ఎందుకివ్వాలంటూ రైతులపై రుసరుసలాడుతుండటంతో ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రత్యేక స్క్వాడ్‌లు ఇలాంటి వాటిపై దృష్టి సారించాల్సి ఉంది. అప్పుడు అక్రమ నిల్వలు బయటికి వస్తాయి. రైతులకు మేలు జరుగుతుంది. ముందస్తు సమాచారం ఇచ్చి తనిఖీలకు తీసుకెళుతుండటం వల్ల తనిఖీలు నామమాత్రం అయినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక బృందం ఆదోని, కౌతాళం మండలాల్లో తనిఖీలు జరిపి రూ.48.5 లక్షల విలువచేసే రసాయన ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేసింది. స్క్వాడ్ బృందం కౌతాళంలో తనిఖీలు నిర్వహించినా, ఆర్‌బీకేల్లోని ఎరువులపై ప్రైవేటు పెత్తనం చెలాయించడాన్ని గుర్తించలేదు. మరో బృందం గూడూరు, ఎమ్మిగనూరు, గోనెగండ్లలో తనిఖీలు నిర్వహించింది. ఈ బృందం రూ.38.29 లక్షల విలువ చేసే ఎరువులు, పురుగు మందుల అమ్మకాలను నిలిపివేసింది.