
తుంగాతీరం.. విషాదం
● గల్లంతైన ముగ్గురు యువకులు మృతి
● పుష్కర ఘాట్ వద్ద మృతదేహాలు లభ్యం
● శోకసంద్రంలో మృతుల కుటుంబీకులు
మంత్రాలయం: విహారయాత్ర నిమిత్తం మంత్రాలయం వచ్చిన ఏడుగురు యువకుల్లో ముగ్గురు విగతజీవులుగా మారడంతో తుంగాతీరంలో విషాదం అలుముకుంది. తుంగభద్ర నదిలో శనివారం గల్లంతైన ముగ్గురు యువకులు ఆదివారం శవవై తేలారు. కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లా అర్షికేరి మండలం జావగల్ గ్రామానికి చెందిన ఏడుగురు స్నేహితులైన రఘునాథ్, నారాయణ, దర్శన్, హేమంత్, అజిత్, సచిన్, ప్రమోదులు శనివారం మంత్రాలయం చేరుకున్నారు. కాగా పుణ్యస్నానాలు ఆచరణలో భాగంగా సాయంత్రం తుంగభద్ర నదికి స్నానాలకు వెళ్లగా వరద నీటి ఉధృతిలో రమేష్ కుమారుడు అజిత్, కుమార్ కొడుకు సచిన్, మోహన్ కుమారుడు ప్రమోదులు కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చీకటి పడటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఆదివారం ఉదయం ఆదోని సబ్‌కలెక్టర్ మౌర్యభరద్వాజ్ నేతృత్వంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం, స్థానిక మత్య్సకారులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకుల మృతదేహాలు పుష్కర ఘూట్ వద్ద లభ్యమైయ్యాయి. విగతజీవులుగా తమ కుమారులు బయటపడటంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. వారి రోదనలతో తీరం అంతా కన్నీటి సంద్రంగా మారింది. చేతికి వచ్చిన కుమారులు మృత్యువాత పడటంతో అటు తల్లితండ్రులు, స్థానికులను ఎంతగానో కలిచి వేసింది.
మృతదేహాలు స్వస్థలాలకు తరలింపు..
గల్లంతైన యువకుల మృతదేహాలు ఆదివారం ఉదయం 10.40 గంటలకు పుష్కరఘాట్ వద్ద లభ్యమైయ్యాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను శ్రీ మఠం అంబులెన్స్ ద్వారా ఎమ్మిగనూరుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంతో వారి స్వస్థలాలకు తరలించారు. కాగా ఆదోని సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్, ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు నేతృత్వంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం, స్థానిక మత్య్సకారులు సాహసోపేతంగా మృతదేహాల గాలింపు కోసం శ్రమించారు. వారి కష్టం పట్ల స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో స్థానిక తహసీల్దార్ రమాదేవి, కోసిగి సీఐ మంజునాథ్, ఎస్‌ఐలు శివాంజల్, విజయకుమార్, ఆర్‌ఐ జనార్థన్‌రావు, వీఆర్వో భీమన్న పాల్గొన్నారు.

తుంగాతీరం.. విషాదం