
ముగ్గురికి కారుణ్య నియామకాలు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలోని కార్యాలయాల్లో కారుణ్య నియామకాల కింద ముగ్గురికి ఉద్యోగాలు కల్పించినట్లు జిల్లా పరిషత్ సీఈఓ సీ నాసరరెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను అందించారు. పీఎండీ ఇంతియాజ్‌ను నంద్యాల జిల్లా వెలుగోడు మండల పరిషత్ కార్యాలయానికి, ఎం విద్యుల్లతను కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నేమకల్ జెడ్పీ హైస్కూల్‌కు, ఎస్ రిజ్వానాను నంద్యాల జిల్లా శిరివెళ్ల జెడ్పీ హైస్కూల్‌కు నియమిస్తూ ఉత్తర్వులు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో మిడ్తూరు జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి పాల్గొన్నారు.
గురుకులాల్లో మిగిలిన సీట్ల భర్తీకి చర్యలు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 10వ తరగతి, సీనియర్ ఇంటర్‌లో మిగిలిన సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఐ.శ్రీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 16న ఉదయం 9.30 గంటలకు చిన్నటేకూరులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో హాజరు కావాలన్నారు. 9వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు చేపడతామన్నారు. బీఆర్‌ఏజీసీఈటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం అరికెరలో సీఈసీ (మిగిలిన సీట్లకు) చదివేందుకు ఆసక్తి కలిగిన జూనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ నెల 16న ఉదయం 9.30 గంటలకు చిన్నటేకూరు గురుకులంలోనే స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఆసక్తి, అర్హులైన విద్యార్థులు హాజరు కావాలని ఆమె పేర్కొన్నారు.
ఎస్సార్బీసీకి నీటి విడుదల
పాణ్యం: గోరుకల్లు జలాశయం నుంచి సోమవారం ఎస్సార్బీసీకి నీటిని విడుదల చేశారు. గోరుకల్లు ఓటీ రెగ్యులేటర్ వద్ద పూజలు చేసిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి స్విచ్ ఆన్ చేసి గేట్లును తెరిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు నీటిని వృథా చేయకుండా వినియోగించుకోవాలన్నారు. ప్రస్తుతం 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గోరుకల్లులో 3 టీఎంసీలు ఉండగా వాటిని ఎస్సార్‌బీసీ ఆయకట్టు రైతులకు ఇబ్బంది లేకుండా నీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ సుభకుమార్, కడా ఈఈ కృష్ణన్న, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
‘పంటల బీమా’కు నేడు తుది గడువు
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన పత్తి, వేరుశనగకు ఉద్దేశించిన వాతావరణ ఆధారిత పంటల బీమా కోసం ప్రీమియం చెల్లింపు గడువు ఈ నెల 15వ తేదీతో ముగియనుంది. బీమా చేసుకోవడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే అవకాశం ఉంది. పత్తికి హెక్టారుకు రూ.లక్ష విలువకు బీమా చేస్తారు. ప్రీమియం హెక్టారుకు రూ.5000 చెల్లించాల్సి ఉంది. వేరుశనగ హెక్టారుకు రూ.70 వేల విలువకు బీమా చేస్తారు. రైతులు ప్రీమియం రూ.1400 చెల్లించాల్సి ఉంది.
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించం
కర్నూలు(సెంట్రల్): పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్(పీజీఆర్‌ఎస్)కు వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కారం చూపాలని, లేదంటే చర్యలు తప్పవని అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌లో భాగంగా ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారాలపై కిందిస్థాయి సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. లాగిన్‌లో వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. సీఎంఓ గ్రీవెన్స్‌కు సంబంధించి పెండింగ్‌ల ఉన్న అర్జీలను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలన్నారు. డీఆర్వో సీ.వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

ముగ్గురికి కారుణ్య నియామకాలు