
అంతర్రాష్ట్ర బైకు దొంగల అరెస్టు
కర్నూలు: వివిధ చోట్ల బైకులను చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు అంతర్‌రాష్ట్ర దొంగలను మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. ఈ ఏడాది మే 22వ తేదీన కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఓ ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూన్ 18న మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టగా దొంగల చిట్టా బయటపడింది. సీసీ ఫుటేజీ, సాంకేతిక ఆధారంగా నిందితులు అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం బురుజుపల్లి గ్రామానికి షేక్ బాబా ఫకృద్దీన్, పెద్దమండెం మండలం గుడిసెల చెరువు గ్రామానికి చెందిన షేక్ దాదా పీరా, కడప పట్టణానికి చెందిన చౌడగండ్ల అనీస్ అని తేలింది. వీరిని కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని ఓ టైల్స్ ఫ్యాక్టరీ వెనకాల ఉన్న కంప చెట్ల వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 24 బైకులను రికవరీ చేసి కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్ ఎదుట హాజరుపర్చారు. సీఐలు శేషయ్య, నాగశేఖర్, ఎస్‌ఐ చంద్ర తదితరులతో విలేకరుల సమావేశం నిర్వహించి డీఎస్పీ బాబు ప్రసాద్ వివరాలను వెల్లడించారు. షేక్ బాబా ఫకృద్దిన్, షేక్ దాదా పీరా, అనీస్ తదితరులు కలసి జట్టుగా ఏర్పడి బైకులు చోరీ చేసి కర్నూలులో దాచిపెట్టి నంద్యాల పట్టణానికి చెందిన సుభాన్, షాపీరాల ద్వారా విక్రయించి సొమ్ము చేసుకునేవారు. ఎలక్ట్రానిక్ పరికరాలతో నకిలీ ఆర్‌సీ (డూప్లికేట్)లను తయారు చేసి వాటిని ఒరిజినల్‌గా చూపి గ్రామీణ ప్రాంతాల్లో విక్రయించేవారు. నంద్యాలకు చెందిన సుభాష్, షాపీరాలు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేయనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.
24 ద్విచక్ర వాహనాలు రికవరీ

అంతర్రాష్ట్ర బైకు దొంగల అరెస్టు