
కోడుమూరు మహిళా మార్ట్ మూత
కర్నూలు(అగ్రికల్చర్)/కోడుమూరు రూరల్:
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం, డీఆర్‌డీఏ ఏపీఎం, సీసీల అవినీతి కారణంగా కోడుమూరులోని చేయూత మహిళా మార్ట్ మూతపడింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో ఒక వెలుగు వెలిగిన ఈ మహిళా మార్ట్‌ను నేడు చీకటి కమ్మేసింది. ఈ నెల 11న సాక్షిలో ‘మూత దిశగా మహిళా మార్ట్’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఊహించినట్లుగానే మార్ట్ మూతపడటం పొదుపు మహిళలకు తీరని ఆవేదనను మిగిల్చింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2021–22లో కోడుమూరులో పైలెట్ ప్రాజెక్టుగా మహిళా మార్ట్ ఏర్పాటైంది. కార్పొరేట్ తరహాలో మార్ట్ పొదుపు మహిళలతో పాటు ఇతర అన్ని వర్గాల వినియోగదారులను ఆకట్టుకుంది. 2024 మే నెలలో జరిగిన ఎన్నికల వరకు లాభాల బాటలో నడచిన మార్ట్ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మార్ట్‌ను పర్యవేక్షిస్తూ గుప్పిట్లో పెట్టుకున్న అప్పటి ఏపీఎం, సీసీలు పథకం ప్రకారం నిధులను కొల్లగొట్టారు. చివరికి మూతపడటానికి కారణమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం మార్ట్ మేనేజర్, మార్ట్ కమిటీ ప్రెసిడెంట్, మార్ట్ కమిటీ సభ్యురాలిని మాత్రమే బాధ్యులను చేసి సిబ్బందిని కాపాడినట్లు చర్చ జరుగుతోంది.