ఆరోగ్యమిత్రల మెడపై కత్తి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యమిత్రల మెడపై కత్తి

Jul 14 2025 5:05 AM | Updated on Jul 14 2025 5:05 AM

ఆరోగ్

ఆరోగ్యమిత్రల మెడపై కత్తి

ఆరోగ్యశ్రీ అంటే వైఎస్‌ఆర్‌. వైఎస్‌ఆర్‌ అంటే ఆరోగ్యశ్రీ అనేంతగా ప్రాచుర్యం పొందిన పథకం ఇది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చి.. ఎన్నిసార్లు పేరు మార్చినా ఇప్పటికీ ఈ పథకాన్ని ప్రజలు ఆరోగ్యశ్రీగానే పిలుస్తుండటం విశేషం. ఈ పథకానికి వైఎస్సార్‌ తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరింత మెరుగులుదిద్ది ప్రజల అభిమానం చూరగొన్నారు. ఇక వీరిద్దరి పేర్లను ఆ పథకం నుంచి దూరం చేయలేమని భావించిన కూటమి ప్రభుత్వం.. ఏకంగా పథకం రద్దు దిశగా పావు కదుపుతుండటం గమనార్హం.

ఆరోగ్యశ్రీకి మంగళం..!

ఆయుష్మాన్‌ భారత్‌కు రంగం సిద్ధం

ఇప్పటికే ఐదుసార్లు

ఉద్యోగులకు శిక్షణ

నెల రోజుల్లో ప్రారంభించే అవకాశం

మెడికోకు ప్రీ ఆథరైజేషన్‌ అధికారం

ప్రశ్నార్థకంగా

ఆరోగ్య మిత్రల భవిష్యత్‌

కర్నూలు(హాస్పిటల్‌): రాష్ట్రంలో 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. జేబులో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు ఎంతటి కార్పొరేట్‌ ఆసుపత్రిలోనైనా దర్జాగా ఉచిత వైద్యం చేయించుకునే హక్కును ఆయన పేదలకు కల్పించారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్‌ఆర్‌ తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పథకాన్ని మరింత మెరుగుపరిచారు. గత టీడీపీ ప్రభుత్వంలో 1800లోపు ఉన్న చికిత్సలను వైఎస్‌ జగన్‌ 3,255కు పెంచారు. ఈ పథకం ద్వారా హైదరాబాద్‌, బెంగళూరు, చైన్నె తదితర నగరాల్లోనూ వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించారు. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ పథకానికి ఎన్టీఆర్‌ వైద్యసేవగా పేరు మార్చింది. అయినప్పటికీ ప్రజలు ఆరోగ్యశ్రీగానే పిలుస్తుండటాన్ని పాలకులు జీర్ణించుకోలేకపోయారు. ఈ పథకాన్ని ఎలాగైనా తొలగించాలనే కుట్రకు ప్రభుత్వం పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయుష్మాన్‌ భారత్‌ను తెరపైకి తీసుకొస్తున్నట్లు తాజా పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. ఈ విషయమై ఇప్పటికే ఆరోగ్యశ్రీ ఉద్యోగులు ఐదు విడతల శిక్షణ కూడా పూరి చేయడం గమనార్హం. మరో నెల రోజుల్లో పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

ఇకపై జిల్లా కలెక్టర్‌ నుంచి నిధులు

ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా సంబంధిత నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు క్లెయిమ్‌ అమౌంట్‌ విడుదలవుతోంది. ఆయుష్మాన్‌ భారత్‌ అమలులోకి వస్తే క్లెయిమ్‌ అప్రూవల్‌ ఇచ్చాక నిధులను జిల్లా కలెక్టర్‌ నుంచి విడుదల చేయనున్నట్లు సమాచారం. నెట్‌వర్క్‌ ఆసుపత్రులపై ఏవైనా ఫిర్యాదులు వచ్చినా జిల్లా కలెక్టర్‌ నేరుగా చర్యలు తీసుకునే అధికారం కల్పించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం ఆయుష్మాన్‌ భారత్‌ పథకం అమలు చేస్తేనే నిధులు ఇస్తామని చెప్పినట్లు చర్చ జరుగుతోంది. ఏడాది కాలంగా కేంద్రం ఇస్తున్న నిధులను ఇతర పథకాలకు వాడుకుంటున్నారనే సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆయుష్మాన్‌ భారత్‌ అమలుకు ప్రత్యేకంగా ఒక మెడికోను ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం.

ప్రైవేటు ఆసుపత్రులు

ఒప్పుకుంటాయా...!

● ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎత్తివేసి ఆయుష్మాన్‌ భారత్‌ను తీసుకొచ్చే యోచనలో కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

● ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకం అమలులో ఉంది.

● కాగా ఆరోగ్యశ్రీ కంటే ఆయుష్మాన్‌భారత్‌లో వ్యాధుల సంఖ్య 1900లోపే ఉండటం, ప్యాకేజి కూడా తక్కువగా ఉండటంతో ప్రైవేటు ఆసుపత్రు లు దీనిపై నిరాసక్తి చూపుతున్నట్లు సమాచారం.

● ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ఇక్కడ కూడా అమలు చేసి 1900 వ్యాధులపైబడిన వ్యాధులను బీమా పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.

● ఈ మేరకు నూతన ఆరోగ్య పాలసి రూపొందించే పనిలో కూటమి పెద్దలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఎన్‌టీఆర్‌ వైద్యసేవ కియోస్క్‌

ట్రస్ట్‌నే నమ్ముకున్నాం

ఆరోగ్యశ్రీ స్థానంలో ఆయుష్మాన్‌ భారత్‌ తీసుకొస్తున్నట్లు తెలిసింది. సంబంధిత నెట్‌వర్క్‌ ఆసుపత్రిలోని మెడికో ద్వారా లాగిన్‌ చేపట్టనుండటంతో వైద్యమిత్రల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో 165 మంది పనిచేస్తుండగా, చాలా మంది 17 సంవత్సరాలుగా ట్రస్ట్‌నే నమ్ముకున్నారు. ఇప్పటి వరకు మాకు జాబ్‌సెక్యూరిటీ, కనీస వేతనం కూడా లేదు. ట్రస్ట్‌లో జరుగుతున్న పరిమాణాలతో వైద్యమిత్రల్లో ఆందోళన నెలకొంది.

– కె.దేవేంద్రనాయక్‌, స్టేట్‌ డిప్యూటీ జనరల్‌ సెక్రటరి, ఏపీ వైద్యసేవ ఎంప్లాయీస్‌ జేఏసీ

ఉద్యోగుల్లో ఆందోళన

ఆరోగ్యశ్రీ స్థానంలో ఆయుష్మాన్‌ భారత్‌ తెస్తారని మాకూ సమాచారం వస్తోంది. కానీ ఇప్పటి వరకు దీని గురించి ఎలాంటి క్లారిటీ లేదు. ఉద్యోగులకు సైతం ఎలాంటి సమాచారం అందడం లేదు. ఆరోగ్యశ్రీ పథకం ఉంటుందా, లేదా అనేది అర్థం కాని పరిస్థితి. ఆయుష్మాన్‌ భారత్‌ పథకానికై తే ప్రస్తుతం హెచ్‌హెచ్‌ఆర్‌, పీఆర్‌ లాగిన్‌ ఐడీలు చేయిస్తున్నారు. ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

– సి.కంబగిరి, జిల్లా అధ్యక్షుడు, ఏపీ వైద్యసేవ ఎంప్లాయీస్‌ యూనియన్‌, కర్నూలు

ఆరోగ్యశ్రీ స్థానంలో ఆయుష్మాన్‌భారత్‌ను తీసుకొచ్చి లాగిన్‌ అవకాశాన్ని సంబంధిత నెట్‌వర్క్‌ ఆసుపత్రిలోని మెడికో ద్వారా చేపట్టనుండటంతో ఆరోగ్యమిత్రల ఉనికి ప్రశ్నార్థకం కానుంది. ఒకవైపు పథకాన్ని మార్చే పనులు వేగవంతంగా చేస్తున్నా మిత్రల గురించి మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో 98 మంది వైద్యమిత్రలు.. నంద్యాల జిల్లాలో 67 మంది ఆరోగ్యమిత్రలు పనిచేస్తున్నారు. గత 17 సంవత్సరాలుగా ఇందులో చాలా మంది ఉద్యోగులు ట్రస్ట్‌ను నమ్ముకుని పనిచేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వీరి మెడపై కత్తి వేలాడ తీస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఆరోగ్యమిత్రల మెడపై కత్తి1
1/2

ఆరోగ్యమిత్రల మెడపై కత్తి

ఆరోగ్యమిత్రల మెడపై కత్తి2
2/2

ఆరోగ్యమిత్రల మెడపై కత్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement