
పులికి ఉచ్చు బిగుస్తోంది!
ఆత్మకూరు రూరల్: నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ అభయారణ్యం (ఎన్‌ఎస్‌టీఆర్)లో పులులు సంరక్షణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పులులు ఉచ్చుల్లో చిక్కుకుని మృత్యువాత పడుతున్నా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నల్లమలలో వన్యప్రాణుల వేటగాళ్లు సంచరిస్తున్నారనేందుకు ఇటీవల జరిగిన సంఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. జింకలకు వేసిన ఉచ్చుల్లో పులులు చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నాయి.
ప్రస్తుతం నల్లమలలోని నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ అభయారణ్యంలో పులుల సంఖ్య 87కు చేరుకున్నాయి. కాని ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనల్లో దేశంలో పులుల అసహజ మరణాలు పెరిగి పోతుండటం వన్యప్రాణ్రి ప్రేమికులకు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా గడిచిన మూడేళ్లలో పదులసంఖ్యలో పెద్దపులులు మరణించాయి. అలాగే మూడేళ్లలో నల్లమలలో రెండు పులులు అసహజ మరణం పొందగా అవి రెండు కూడా వేటగాళ్లు పన్నిన ఉచ్చులకు బలైనట్లు తెలుస్తోంది. ఇటీవల మరో పులి కూడా ఉచ్చకు చిక్కుకుని తీవ్రమైన గాయంతో తప్పించుకుంది. అయితే గాయంతో అడవిలో తిరుగుతూ అటవీ సిబ్బందికి కనిపించంతో దానికి మత్తుసూదితో అపస్మారకంలోకి తీసుకు వెళ్లి బిగుసుకున్న ఉచ్చును తొలగించి గాయానికి చికిత్స చేశారు. అయితే బిగిసిన ఉచ్చు కారణంగా మెడలో ఉన్న అన్నవాహికకు లోతైన గాటు పడడంతో పాటు ఇన్‌ఫెక్షన్ సమస్యలు గుర్తించడం జరిగింది. స్థానిక వన్యప్రాణి వైద్య నిపుణుల సూచన మేరకు గాయపడిన పులిని తిరుపతి జూకు తరలించి అక్కడ పశువైద్య కళాశాలకు చెందిన డిపార్ట్ మెంటల్ హెడ్స్ చేత సర్జరీ నిర్వహించారు. తిరుపతి జూలో గాయపడిన పులికి ఆంటి బయాటిక్స్ ఇస్తూ చికిత్స కొనసాగిస్తున్నారు.ద్రవాహారంతో ఆపులి కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఉచ్చుల చిక్కులు తప్పించ లేరా?..
నల్లమల అడవుల్లో పులులు లక్ష్యంగా పని చేసే వేటగాళ్ళు లేనప్పటికి పులి ఆహార జంతువులైన జింకలకోసం పన్నుతున్న ఉచ్చులకు పులులు చిక్కుతున్నట్లు అర్థమవుతుంది. సహజంగా నీటి వనరుల వద్ద, జేడ మైదానాల్లో (సాల్ట్ లిక్ ల్యాండ్స్) వేటగాళ్ళు ఉచ్చులు వేస్తుంటారు. ద్విచక్ర వాహనాల బ్రేక్, క్లచ్ వైర్లు ఉచ్చులుగా తయారు చేసి జంతువులు సంచరించే ప్రాంతాల్లో పొదల మాటున వీటిని ఏర్పాటు చేస్తారు. నీటికోసం, ఉప్పు నాకడం కోసం వచ్చే జంతువులు ఈ ఉచ్చుల్లో చిక్కుకు పోతాయి.అయితే తన ఆహార జంతువుల కోసం వచ్చే పులులు కూడా అపుడప్పుడు ఈ ఉచ్చులకు చిక్కు బడి పోతున్నాయి.కాగా పులి అత్యంత బలమైన జంతువు కాబట్టి ఈ ఉచ్చులను తెంచుకోగలుగుతున్నాయి. అయినప్పటికి ఆ ప్రయత్నంలో అవి ఉచ్చులు బిగుసు పోవడంతో తీవ్రంగా గాయ పడుతు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాయి.
గేదెలతో ఉచ్చుల తొలగింపు ఇలా..
పులులభయారణ్యాలలో మానవ సంచారం నిరోధించాలనే మౌలిక నిబంధనల మేరకు అటవీ ప్రాంతాల చుట్టు పక్కల గ్రామాలకు చెందిన పశువులను అడవుల్లో మేతకు అనుమతించడం లేదు. సహజంగా పశుగ్రాసం కోసం గ్రామీణ ప్రాంతాల వారు తమ పశువులను అడవుల్లోకి పంపుతుంటారు. పులుల అభయారణ్యాలలో పశువులు మేతకోసం తిరుగుతుంటే ఉచ్చులకు తగులు కోవడం ద్వారా వాటి ఉనికిని బట్టబయలు చేయగలుగుతాయి. పశు కాపరులు ఈ విషయాన్ని అటవీ సిబ్బందికి చేరవేయ గలుగుతారు. అంతే కాకుండా అడవుల్లోకి వచ్చే అనుమానాస్పద వ్యక్తుల గురించి సమాచారం అందించే వీలు కూడా ఉంటుంది.కాబట్టి పశువుల కాపర్ల సేవలను కూడా పులి సంరక్షణలో వినియోగించుకోవాలని వన్యప్రాణి ప్రేమికులు అభిప్రాయ పడుతున్నారు.
ఆ మూడు పులులు ఆడవే..
నల్లమలలో జింకల వేటగాళ్లు
నీటి వనరుల ప్రాంతాల్లో ఉచ్చులు వేస్తున్న వైనం
పులులు చిక్కుకుని మృత్యువాత
మూడేళ్లులో రెండు మృతి
ఇటీవల ఉచ్చుకు చిక్కుకుని బయట పడిన మరొకటి
నల్లమలలోని ఎన్‌ఎస్‌టీఆర్ ఆత్మకూరు అటవీ డివిజన్‌లో ఉచ్చులకు చిక్కి మరణించిన రెండు పులులు టీ48, టీ123లతో పాటు ఉచ్చు బిగిసి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న పులికూడా ఆడపులే కావడం విషాదం. పులుల ప్రవర్ధనంలో ఆడ పులి ఎంతో పాధాన్యత కలిగి ఉంటుంది. ఒక ఆడ పులి తన జీవిత కాలంలో కనీసం 12 పులులకు జన్మనిస్తుంది. మరణించిన పులులన్ని కూడా 4 నుంచి 8 సంవత్సరాలలోపువే కావడం గమనార్హం. నాలుగేళ్ల వయస్సులో సంతానోత్పత్తికి సిద్ధమయ్యే ఆడపులుల మరో నాలుగేళ్లు తన పిల్లలను పెంచి పెద్ద చేసి తిరిగి మరో మారు సంతానోత్పత్తికి సిద్ధపుడుతుంది.ఈ లెక్కన ఒకసారి సంతానోత్పత్తి జరిపిన తరువాతో లేక సిద్ధమవుతున్న సమయంలోనో ఈ పులులు మరణించాయి. దీంతో ఒక్కో పులి కనీసం 10 పిల్లలకు జన్మనిచ్చే అవకాశం కోల్పోయాయి.

పులికి ఉచ్చు బిగుస్తోంది!