
మోసానికి బ్రాండ్ చంద్రబాబు!
● దళిత సర్పంచ్‌ను అవమానించడం దారుణం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి
ఆదోని టౌన్: ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా మోసానికి బ్రాండ్‌గా టీడీపీ అధినేత చంద్రబాబు నిలిచారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. ఆదోని మండలం ఢణాపురం గ్రామంలో దళిత సర్పంచ్‌ను సమావేశానికి పిలిచి ‘కూటమి’ నేతలు అవమానించడం దారుణమన్నారు. వచ్చే ఎన్నికల్లో వారికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. ఆదోని పట్టణంలోని రోషన్ గార్డెన్‌లో శుక్రవారం వైఎస్సార్‌సీపీ ఆదోని నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేందర్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శశికళ, ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్ లోకేశ్వరి హాజరయ్యారు. సమావేశంలో ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఆదోనిలో మెడికల్ కళాశాల నిర్మాణం ప్రారంభమైందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ, నాడు–నేడు పథకాల కింద పాఠశాలల భవన నిర్మాణాలు జరిగాయని తెలిపారు. ఆదోని అభివృద్ధికి సాయన్న ఎంతో కృషి చేశారన్నారు. సాయన్న సేవలు అభినందనీయమన్నారు.
అధైర్యపడొద్దు
‘కూటమి’ నేతలు అనేక విధాలుగా వేధిస్తున్నారని, ఎవరూ అధైర్యపడొద్దని ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. ఆదోనిలో సాయన్న, కర్నూలులో తాను, రాష్ట్ర స్థాయిలో జగనన్న లీగల్ టీం అండగా ఉంటుందన్నారు. పార్టీ పటిష్టతకు, ప్రజా సమస్యల పరిష్కారానికి ధైర్యంగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ‘కూటమి’ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సిందేనన్నారు.
ఉద్యోగాలు ఏవీ?
ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు బాబు వస్తే జాబు వస్తుందని, యువతకు నిరుద్యోగభృతి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని నమ్మబలికి అధికారం చేపట్టిన తర్వాత మోసం చేశారన్నారు. బాబు పాలనలో ప్రజలకు రూ.81 వేల కోట్ల అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లికి వందనం పేరుతో తల్లులను మోసం చేశారన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఆదిలోనే హంసపాదు అయినట్లయ్యిందన్నారు. సమావేశంలో న్యాయవాదులు జీవన్‌సింగ్, శబరీష్, ఫయాజ్‌అమ్మద్, వైఎస్సార్‌సీపీ నాయకులు దేవా, యేసేబు, వై.పి.గంగాధర్, వీరారెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

మోసానికి బ్రాండ్ చంద్రబాబు!