
ఆశలు మట్టిపాలు
నక్కలదిన్నె వద్ద ట్రాక్టరుతో
పైరును దున్నేస్తున్న దృశ్యం
ఎన్నో ఆశలతో రైతులు సాగు చేసిన మినుము పంట మట్టిపాలైంది. వర్షాలు లేక పంట గిడిసబారిపోయి పూత, కాయ లేకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో రైతులు దున్నేస్తున్నారు. రెండు నెలలుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పంటను వర్షాలు లేకపోవడంతో తొలగిస్తున్నారు. నక్కలదిన్నెకు చెందిన పుల్లారెడ్డి అనే రైతు ఐదెకరాల్లో సాగు చేసిన మినుము పంటను గురువారం ట్రాక్టరుతో దున్నేశాడు. ఓ వైపు ఆ రైతు ట్రాక్టరుతో పంటను దున్నేస్తుంటే మరో వైపు గేదెలు, జీవాలు మేస్తూ కనిపించాయి. ‘ఎకరానికి రూ.26 వేల ప్రకారం పొలాన్ని కౌలుకు తీసుకొని మినుము పంట సాగు చేశాను. పెట్టుబడి కింద ఎకరానికి రూ.25 వేల వరకు వెచ్చించాను. కౌలు పెట్టుబడి కలిపి ఐదెకరాలకు రూ.2.50 లక్షలు ఖర్చు అయ్యింది. పంట సాగు కాలం పూర్తయినప్పటికీ పూత కూడా రాక పోవడంతో దున్నేశా’ అని రైతు పుల్లారెడ్డి చెప్పారు. ఇదే తరహాలో ఇటీవల ఆర్.నాగులవరం గ్రామానికి చెందిన సుబ్బనర్సయ్య అనే రైతు కూడా మిర్చి పంట పూత రాలేదని దున్నేశాడు. ఇలా ఎంతో మంది రైతులు వర్షాలు లేక పంటలను తొలగిస్తున్నారు.
– రుద్రవరం