
పెట్టుబడి మోసాలపై అప్రమత్తం
కర్నూలు: సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులను అనుసరిస్తూ తక్కువ సమయంలో అధిక లాభాలు ఇస్తామని ప్రలోభపెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టెలిగ్రామ్, వాట్సప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ‘కంటెంట్ రివ్యూ చేసి డబ్బు సంపాదించండి..’ అంటూ పంపిన లింక్‌ను చూసి ఓ మహిళా ఉద్యోగి స్పందించి రూ.1.2 లక్షలు పెట్టుబడి పెట్టిందని, తర్వాత యాప్‌కి యాక్సెస్ లేకుండాపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ‘షేరింగ్ మార్కెట్ ట్రేడింగ్‌లో గ్యారెంటీ ప్రాఫిట్..’ అంటూ వచ్చిన నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫాంకు ఓ యువకుడు రూ.75 వేలు డబ్బు పంపి మోసపోయాడని... ఇలా జిల్లాలో కొన్ని ఆన్‌లైన్ పెట్టుబడి మోసాల కేసులు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మోసాలలో వేలు మొదలు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారని, ఇలాంటి నకిలీ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
మోసపూరిత విధానం ఇలా...
టెలిగ్రామ్, వాట్సప్ గ్రూపులకు ‘ఇన్వెస్ట్ చేసి డబ్బు డబుల్ చేసుకోండి’... అంటూ మోసగాళ్లు ముందుగా లింకులు పంపుతారు. లాభం చూసి ప్రాథమికంగా పెట్టిన డబ్బులకు డబుల్ లాభం వచ్చేలా నమ్మించి చివరకు లక్షల్లో పెట్టుబడులు పెట్టించి యాప్ లేదా లింక్ బ్లాక్ చేసి డబ్బు విత్‌డ్రా కాకుండా చేసి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆర్‌బీఐ, ఎస్‌ఈబీఐ వంటి చట్టబద్ధత సంస్థల నుంచి గుర్తింపు పొందని ఏవైనా ఫైనాన్స్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా డబ్బు పెట్టుబడి పెట్టరాదని సూచించారు. గ్యారెంటీ లాభం అని చెప్పే ప్రతి ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌ను సందేహంతో చూడాలని, ఎలాంటి అనుమానాస్పద లింకులు వచ్చినా క్లిక్ చేయకుండా ఉండటమే శ్రేయస్కరమని పేర్కొన్నారు. మోసానికి గురైతే వెంటనే స్థానిక పోలీసులకు లేదా సైబర్ క్రైం సెల్‌కు నేషనల్ సైబర్ హెల్ప్‌లైన్ 1930, www.cybercrime.gov.inకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.
నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లను
నమ్మొద్దు
మోసపోతే సైబర్ హెల్ప్‌లైన్
1930ను ఆశ్రయించండి
జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి