
యువకుడి దుర్మరణం
కోడుమూరు రూరల్: కృష్ణగిరి మండలం గుండ్ల మల్లాపురం గ్రామానికి చెందిన హేమంత్ (21) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందా డు. కోడుమూరు ఎస్‌ఐ ఎర్రిస్వామి తెలిపిన వివరాల మేరకు.. పురుగు మందు కొనుగోలు చేసేందుకు బుధవారం సాయంత్రం బైక్‌పై తన స్నేహితుడు శంకర్‌తో కలసి కోడుమూరుకు చేరుకున్నాడు. మందు తీసుకుని తిరిగి వెళ్తుండగా కోడుమూరు – కృష్ణాపురం రోడ్డులో మడుగుండ్ల వాగు సమీపంలో బొలేరొ వాహనం ఢీకొనడంతో హేమంత్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన శంకర్‌ను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు హేమంత్‌కు ఐదునెలల క్రితమే వివాహమైంది. కుమారుడు మృతితో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతుడి తండ్రి గిడ్డయ్య ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
బైక్ ఢీకొని వాచ్‌మన్ మృతి
కర్నూలు: కర్నూలు శివారులోని సంతోష్ నగర్ జాతీయ రహదారిపై (చరిత వైన్స్ దగ్గర) బైక్ ఢీకొన్న ప్రమాదంలో నాగరాజు(44) తీవ్ర గాయాలకు గురి కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే లోగా మృతిచెందాడు. ఈయన బాలాజీ నగర్‌లో (సంతోష్ నగర్) నివాసముంటాడు. సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ పాత బుల్లెట్ షోరూంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి షోరూం దగ్గరి నుంచి భోజనం చేసేందుకు నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ చరిత వైన్స్ దగ్గర రోడ్డు దాటుతుండగా పెదరాముడు అనే వ్యక్తి బైక్‌పై వేగంగా వచ్చి నాగరాజును ఢీకొట్టడంతో కింద పడి తలకు బలమైన గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో రోడ్డుపై పడివుండగా అదే మార్గంలో ఆటోలో వెళ్తున్న మాసుమన్న గుర్తించి తన ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమారుడు శ్రీహరి ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విష ప్రభావంతో యువకుడి మృత్యువాత
బండి ఆత్మకూరు: కాకనూరు గ్రామంలో గురువారం పొలానికి విష గుళికలు చల్లేందుకు వెళ్లిన యువకుడు విష ప్రభావంతో మృతి చెందాడు. ఎస్‌ఐ జగన్మోహన్ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చిలుకల జగదీష్ గురువారం (22) తన పొలంలో సాగు చేసిన వరి పైరుకు విష గుళికలు చల్లేందుకు వెళ్లాడు. ఆ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో విష ప్రభావంతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.