Election : సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం | C Vigil is the new election weapon for public | Sakshi
Sakshi News home page

Election : సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం

Mar 23 2024 1:20 AM | Updated on Mar 23 2024 4:35 PM

జెడ్పీలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంలో పనిచేస్తున్న ఎన్నికల సిబ్బంది - Sakshi

జెడ్పీలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంలో పనిచేస్తున్న ఎన్నికల సిబ్బంది

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై ఫిర్యాదుల స్వీకరణకు సీ విజిల్‌ యాప్‌

ఫిర్యాదు అందిన 5 నిమిషాల్లోనే రంగంలోకి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌

100 నిమిషాల్లో ఫిర్యాదుకు పరిష్కారం

జెడ్పీలో 24 గంటల పర్యవేక్షణలో ఎంసీసీ కంట్రోల్‌ రూం

మీ ఎదుట ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘింస్తున్నా..అవినీతి, అక్రమాలు, ప్రలోభాలకు పాల్పడుతున్నా చూస్తూ ఉండొద్దంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. కోడ్‌ ఉల్లంఘనలను ఆడియో, వీడియో రూపంలో జరుగుతున్న చోటి నుంచే తమకు ఫిర్యాదు చేయొచ్చని చెబుతోంది. ఇందుకు ‘సీ’ విజిల్‌ యాప్‌ను తీసుకొచ్చింది. సామాన్యుడి బ్రహ్మాస్త్రమైన ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదులను స్వీకరించి 100 నిమిషాల్లోనే పరిష్కరించేందుకు జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా కంట్రోల్‌రూం సైతం ఏర్పాటు చేసింది.

కర్నూలు(అర్బన్‌): సార్వత్రిక ఎన్నికల నిబంధనల పక్కాగా అమలు చేసేందుకు, ఉల్లంఘనలపై ఫిర్యాదులను స్వీకరించి వాటిని నిర్ణీత సమయంలోగా పరిష్కరించేందుకు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ రూమ్‌ ఇద్దరు జిల్లా స్థాయి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మూడు షిఫ్టుల ప్రకారం ఇక్కడ ఉద్యోగులు విధులు నిర్వహిస్తుంటారు. ఒక షిఫ్ట్‌ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తుంది. రెండో షిప్ట్‌ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు, మూడో షిఫ్ట్‌ రాత్రి 10 నుంచి తిరిగి ఉదయం 6 గంటల వరకు పనిచేస్తుంది. ప్రతి షిఫ్ట్‌లో 8 మంది ఉద్యోగులు ఖచ్చితంగా ఇక్కడే ఉంటూ ప్రజలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారు. అలాగే వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రసారమయ్యే వ్యతిరేక కథనాలపై కూడా ఎంసీసీ కంట్రోల్‌ రూమ్‌ నుంచి చర్యలు తీసుకుంటారు.

షెడ్యూల్‌ వచ్చిన నాటి నుంచే సీ విజిల్‌ ...

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి సీ విజిల్‌ యాప్‌ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి ఎన్నికల ఉల్లంఘనలపై సాక్ష్యాలతో సహా ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫోటో, వీడియో, ఆడియో ఏదైనా రికార్డు చేసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. కంట్రోల్‌ రూమ్‌కు ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లోనే ఈ సమాచారాన్ని సంబంధిత ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీంకు పంపుతారు. ఈ టీం 15 నిమిషాల్లో ఆ ప్రాంతానికి వెళ్లి 30 నిమిషాల్లో విచారణ పూర్తి చేసి నివేదికను ఎన్నికల అధికారికి చేరవేస్తారు. ఈ నివేదికపై సంబంధిత ఎన్నికల అధికారులు 50 నిమిషాల్లో చర్యలు తీసుకుంటారు. మొత్తం వంద నిమిషాల్లో సీ విజిల్‌ యాప్‌లో అందిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటారు. అలాగే ఫిర్యాదు స్టేటస్‌ తెలుసుకునే వెసులుబాటు కూడా ఇందులో ఉంది.

రిజిస్టర్‌ చేసుకోండిలా ...

గూగుల్‌ ప్లే స్టోర్‌లో ‘సీ విజిల్‌ ’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. సెల్‌ఫోన్‌ నెంబర్‌ ద్వారా దానిలో రిజిస్టర్‌ చేసుకోగానే, ఓటీపీ నెంబర్‌ వస్తుంది. దాన్ని నమోదు చేసిన వెంటనే సీ విజిల్‌ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్‌ ద్వారా ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేయొచ్చు.

పౌరులను భాగస్వామ్యం చేసేందుకు సీ విజిల్‌

సార్వత్రిక ఎన్నికల్లో పౌరులను భాగస్వామ్యులను చేసేందుకే భారత ఎన్నికల సంఘం సీ విజిల్‌ యాప్‌ను అమ లు చేస్తోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేసేందుకు ఈ యాప్‌ ఎంతో ఉపయోగపడుతుంది. జెడ్పీలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ రకాల ఫిర్యాదులు 56 వచ్చాయి. వీటిలో 35 ఫిర్యాదులను పరిష్కరించాం. ఈ కంట్రోల్‌ రూమ్‌ 24 గంటలు పని చేస్తుంది. పౌరులు ఎప్పుడైనా ఎన్నికలకు సంబంధించిన విషయాలపై ఫిర్యాదు చేయవచ్చు.

– జి. నాసరరెడ్డి, ఎంసీసీ జిల్లా నోడల్‌ ఆఫీసర్‌

ఎలాంటి ఫిర్యాదులు చేయవచ్చంటే ...

ఎన్నికల్లో డబ్బు పంపకాలు, ఉచితాలు, బహుమతులు అందించడం, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, మద్యం, మత్తు పదార్థాల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేయడం, ఎన్నికల రోజు ఓటర్లను వాహనాల్లో తరలించడం వంటి ఉల్లంఘనలను ఫొటో లేదా వీడియో, ఆడియో రికార్డు చేసి అప్‌లోడ్‌ చేయవచ్చు.

ఎలా చేయాలంటే ...

మీ సెల్‌ ఫోన్‌లో యాప్‌ ఓపెన్‌ చేయగానే స్క్రీన్‌పై ఫొటో, వీడియో, ఆడియో అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. ఇందులో మీ వద్ద ఏ ఆధారం ఉంటే ఆ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే మీ లోకేషన్‌ నమోదవుతుంది. ఉల్లంఘనకు సంబంధించిన ఆధారాన్ని అప్‌లోడ్‌ చేయాలి. ఏ రాష్ట్రం, ఏ నియోజకవర్గం తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే సదరు ఉల్లంఘనను క్లుప్తంగా వివరిస్తే ఈ ఫిర్యాదు నేరుగా ఎన్నికల సంఘానికి చేరుతుంది. ఎస్‌ఈసీకి చేరిన ఈ ఫిర్యాదును అక్కడి అధికారులు వెంటనే సంబంధిత ఎంసీసీ కంట్రోల్‌ రూమ్‌కు చేరవేస్తారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు వెంటనే చర్యలకు ఉపక్రమిస్తారు.

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement