ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసిన ఏపీటీడీసీ కాలం చెల్లిన బోట్లతో కాలక్షేపం మొత్తం 10 బోట్లలో నాలుగు మూలకు కార్తిక మాసం రోజుల్లో బోట్ల కొరతపై సందర్శకుల ఆగ్రహం
పెట్టుబడులు ఏమైనట్లు?
సర్కారు నిర్లక్ష్యంతో పర్యాటకానికి ఆటు‘బోట్లు’
భవానీపురం(విజయవాడ పశ్చిమ): పర్యాటక రంగంలోని అన్ని విభాగాలకంటే అధిక ఆదాయం తెచ్చిపెట్టే బోటింగ్ వ్యవస్థ విషయంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కాలం చెల్లిన బోట్లతో కాలక్షేపం చేస్తూ ప్రయాణికుల భద్రత గాలికి వదిలేస్తున్నారని.. కమీషన్ల కోసం కక్కుర్తిపడి ఇతర రాష్ట్రాల్లో వాడి పక్కన పడేసిన బోట్లను ఏపీటీడీసీ ఉన్నతాధికారులు కొనుగోలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
మూలకు చేరుతున్నా..
ఏపీటీడీసీ విజయవాడ డివిజన్‌లోని భవానీపురం బెరంపార్క్‌లోగల బోటింగ్ పాయింట్ వద్ద ఉన్న భవానీ, కృష్ణవేణి వంటి 10 బోట్లలో అన్నీ కాలం చెల్లినవే కావడం గమనార్హం. ఇందులో సుమారు మూడున్నర దశాబ్దాల చరిత్రగల ఆమ్రపాలి బోటు పేరును ఏపీ బోటుగా మార్చారు. ఇవన్నీ రెగ్యులర్‌గా పర్యాటకులు, సందర్శకులను భవానీ ద్వీపానికి తీసుకువెళ్లి తిరిగి తీసుకువస్తుంటాయి. అవన్నీ ఎప్పుడూ మరమ్మతులకు గురవతూనే ఉంటాయి.. లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూనే ఉంటారు. మళ్లీ కొన్నాళ్లకు షరా మామూలుగానే మూలన పడటం, రిపేర్లు చేయించడం సర్వసాధారణమై పోయింది. ఇక అడపాదడపా పార్టీలకు బయటకుతీసే బోధిసిరి బోటుకు మరమ్మతులు చేస్తూనే ఉంటారు. పాత బోట్ల మరమ్మతులకు లక్షలాది రూపాయలు వెచ్చించే ఏపీటీడీసీ కొత్త బోట్లు ఎందుకు కొనుగోలు చేయదో అర్థం కాని పరిస్థితి. కేవలం బోటింగ్ ద్వారా మాత్రమే ఏపీటీడీసీకి నెలకు సగటున రూ.30లక్షల నుంచి రూ.40లక్షలకు పైగా ఆదాయం లభిస్తోంది. అంత ఆదాయం లభించే బోటింగ్ వ్యవస్థపై ఏపీటీడీసీ అధికారులు నిర్లక్ష్యం వహించడంపై అటు ప్రజలు, ఇటు సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అరకొర మరమ్మతులతో..
కార్తిక మాసం సందర్భంగా వనభోజనాలు చేసేందుకు విజయవాడ భవానీపురంలో అనువైన భవానీ ద్వీపానికి పర్యాటకులు, సందర్శకులు, నగర ప్రజలు అధిక సంఖ్యలో వస్తారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో అయితే వారితో కిటకిటలాడిపోతుంది. ఈ సమయంలో డ్రై డాక్ (మరమ్మతులు, మెయింటెనెన్స్) పేరుతో వినియోగంలో ఉన్న నాలుగు బోట్లను పున్నమి ఘాట్‌లోని ప్రైవేట్ స్థలంలో పెట్టారు. కాకినాడ నుంచి సర్వేయర్లు వచ్చి వాటిని పరిశీలించి, ఏమేమి చేయాలో చెప్పిన తరువాత ఉన్నతాధికారుల అప్రూవల్ తీసుకుని పనులు మొదలు పెడతారు. ఈలోపు కార్తిక మాసం పుణ్యకాలం గడిచిపోతుంది.
విశాఖలో రెండు సార్లు జరిగిన సీఐఐ సదస్సుల్లో ఎంఓయుల ద్వారా టూరిజం శాఖకు కోట్లాది రూపాయలు పెట్టుబడులుగా వచ్చాయని చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకుంటున్నది నిజమే అయితే కొత్త బోట్లు ఎందుకు కొనుగోలు చేయటం లేదు.. భవానీ ద్వీపాన్ని ఎందుకు అభివృద్ధి చేయరని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ టూరిజం అభివృద్ధి పేరుతో దేశ, విదేశాల్లో పర్యటిస్తూ కాలం గడిపేస్తున్నారు తప్ప, రెండేళ్ల క్రితం విజయవాడలో వచ్చిన వరదల్లో అతలాకుతలమైన భవానీ ద్వీపాన్ని పునరుద్ధరించక పోవడం విడ్డూరం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో ఇంకా కాలం చెల్లిన బోట్లనే వాడుతూ ప్రయాణికుల ప్రాణాలను బలి పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఏపీటీడీసీతో ఒప్పందం చేసుకున్న ఒక ప్రైవేట్ బోటు యాజమాన్యం కారణంగా పవిత్ర సంగమంలో 2017 నవంబర్ 12న వారి బోటు తిరగబడి 22 మంది జలసమాధి అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.


