గన్నవరం: స్థానిక జెడ్పీ బాలుర హైస్కూల్‌లోని పోలింగ్ కేంద్రంలో టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌తో పాటు ఆ పార్టీ నేతలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్థానిక జెడ్పీ బాలుర హైస్కూల్‌లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 15వ వార్డుకు సంబంధించిన బూత్‌లో వైఎస్సార్ సీపీకి చెందిన ఏజెంట్ బయటకు వచ్చిన సమయంలో పలువురు టీడీపీ నేతలు ఒక్కసారిగా లోపలికి చోరబడి రిగ్గింగ్‌కు పాల్పడినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన వైఎస్సార్ సీపీ ఏజెంట్‌తో పాటు పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మోదుగుమూడి వెంకటేశ్వరరావు(ఎంవీఆర్) అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం చోటు చేసుకుంది. పార్టీ నేతల సమాచారం మేరకు కొద్దిసేపటికి మాజీ ఎమ్మెల్యే వంశీమోహన్, జెడ్పీటీసీ సభ్యులు అనగాని రవి, పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. ఓట్లు రిగ్గింగ్‌కు విషయమై పోలీస్ అధికారులను గట్టిగా ప్రశ్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడికి చేరుకున్న ఎస్పీ వి. విద్యాసాగర్‌నాయుడు సర్పంచ్ అభ్యర్థితో పాటు వైఎస్సార్ సీపీ నేతలపై దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. చివరికి ఓట్ల రిగ్గింగ్‌పై ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతారని అధికారులు చెప్పడంతో వివాదం సర్దుమణిగింది.


