పెనమలూరు: స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ అనీల్ చంద్ర పునేఠా అన్నారు. గురువారం కానూరు పంటకాలువ రవీంధ్రభారతి పాఠశాలలో ఉన్న 34, 40, 41 వార్డుల్లో 8 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుపుతున్నామన్నారు. నేడు 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగంచుకోవాలని తెలిపారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సర్పంచి స్థానాల్లో 19 శాతం, వార్డు సభ్యుల స్థానాల్లో 30 శాతం ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. ఆర్డీవో కరుణకుమారి, తాడిగడప కమిషనర్ షేక్. నజీర్ పలువురు అధికారులు పాల్గొన్నారు.
గన్నవరం: స్థానిక ఆర్టీసీ డిపోను గురువారం జిల్లా ప్రజా రవాణా అధికారి కె. వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. తొలుత బస్ స్టేషన్‌లో ప్రయాణికులకు కల్పించిన సదుపాయాలను, టాయిలెట్స్‌ను ఆయన పరిశీలించారు. స్టేషన్‌లోని స్టాల్స్‌ను, ధరల పట్టికలను, ఆఫీస్ రికార్డులను క్షుణ్ణంగా తనీఖీ చేశారు. అనంతరం డిపోను సందర్శించిన ఆయన గ్యారేజ్ సిబ్బందితో సమావేశమయ్యారు. బస్సులు మెరుగైన కండీషన్‌లో ఉండే విధంగా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని సూచించారు. డిపో మేనేజర్ జి. రాంబాబు పాల్గొన్నారు.
మధురానగర్(విజయవాడసెంట్రల్): నూరు శాతం ఉత్తీర్ణతే ధ్యేయంగా 60 రోజుల కార్యాచరణతో పనిచేయాలని ఎన్టీఆర్ జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి బి. ప్రభాకరరావు సూచించారు. స్థానిక మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదులు, బోధనాభ్యాస ప్రక్రియను పరిశీలించారు. అనంతరం 2027 ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు రూపొందించిన ‘లక్ష్య–60’ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక గురించి వివరించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా అధ్యాపకులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.కృష్ణకాంత్ అధ్యాపకులు పాల్గొన్నారు.
చందర్లపాడు(నందిగామ టౌన్): ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి శ్రావణ్‌బాబు పేర్కొన్నారు. చందర్లపాడు గ్రామంలోని సిరాజ్ డెంటల్ క్లినిక్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ క్లినిక్‌పై ఫిర్యాదులు రావటంతో తనిఖీ చేశామన్నారు. నిబంధనలు పాటించని వైద్యశాల యాజమాన్యాలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం చందర్లపాడు, చింతలపాడు గ్రామాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. రోగులకు వైద్యారోగ్య సిబ్బంది మెరుగైన సేవలందించాలన్నారు. ముఖ్యంగా ఆరోగ్య కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటంతో పాటు రోగులకు అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. వైద్యాధికారులు కీర్తి ఐశ్వర్య, రమ్య తదితరులు పాల్గొన్నారు.


