కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ విశేష సేవలందించి, ఇంటింటికీ సంక్షేమాన్ని పంచిన గ్రామ/వార్డు సచివాలయ వలంటీర్లను దారుణంగా అవమానించారు.. వైఎస్సార్ సీపీ ఏజెంట్లుగా ముద్రవేశారు.. వారికి ఇచ్చే రూ.5 వేల గౌరవ వేతనం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే వారిని అవస్థల పాల్జేసి.. ఆ వ్యవస్థనే లేకుండా చేశారు.
సీన్ కట్ చేస్తే.. అదే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్‌ల పేరిట కొత్త వ్యవస్థను తీసుకొచ్చి భారీగా పంపకాలకు పూనుకుంది. ప్రజాసేవకు ఏమాత్రం ఉపయోగపడని ఒక భజన బృందానికి జనం డబ్బును వాడేందుకు సిద్ధమైంది. కేవలం సర్కారుకు డప్పు కొట్టేందుకే వారికి భారీ నజరానాలు ప్రకటించింది. దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో వలంటీర్లుగా పనిచేసిన వారు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. – సాక్షి నెట్‌వర్క్
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఎక్కడా వెనకడుగు వేయకుండా పని చేశాం. ఇంటింటికీ పథకాలు అందించడంలో సాయ పడ్డాం. మాకిచ్చే గౌరవ వేతనం రూ. 5వేలు వృథా అని లెక్కేసి.. వలంటీర్ వ్యవస్థే లేకుండా చేశారు. ఇప్పుడేమో రూ. లక్షలను ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు ఇచ్చేందుకు పూనుకుంటున్నారు. ఇది సరియైన విధానం కాదు. ప్రభుత్వం ఇప్పటికై నా పునరాలోచించి, ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా ఆపాలి.
– కె. సత్యనారాయణ, మాజీ వలంటీర్, బూరుగగూడెం, రెడ్డిగూడెం


