మనస్తాపంతో ఇద్దరు బాలికల బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో ఇద్దరు బాలికల బలవన్మరణం

Oct 4 2026 10:55 AM | Updated on Oct 4 2026 10:55 AM

మనస్తాపంతో ఇద్దరు బాలికల బలవన్మరణం

తల్లి మందలించిందని ఉరేసుకుని ఒకరు.. పరీక్షలో ఫెయిల్‌ అయ్యానని విషం తాగి మరొకరు.. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో వేర్వేరు ఘటనలు

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ)/ పెనమలూరు:

మనస్తాపంతో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చదువుపై దృష్టి పెట్టడం లేదంటూ తల్లి మందలించిందనే కారణంతో ఓ బాలిక ఉరేసుకోగా ఇంకో ఘటనలో పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదనే బాధతో మరో బాలిక గడ్డి మందు తాగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్‌ జల్లా విజయవాడ కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ప్రైజర్‌పేట ముప్పాళ్ళ కోటయ్య వీధిలో ముప్పిడి వెంకటేష్‌ కుటుంబం నివాసం ఉంటోంది. వెంకటేష్‌ దుర్గగుడిలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి. అతడికి ఇద్దరు సంతానం కాగా, కుమార్తె చరితశ్రీ (13) సితార సెంటర్‌ వద్ద ఓ ప్రయివేటు స్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. బాలిక స్కూల్‌ తరుపున హాయికింగ్‌ కెనాయింగ్‌ అనే వాటర్‌ గేమ్స్‌లో ఆడుతుంటుంది. కొద్ది రోజులుగా చదువులో కాకుండా ఆటలపై దృష్టి పెట్టడంతో తల్లి మందలించింది. దీంతో చరితశ్రీ ఎవరితోనూ మాట్లాడకుండా ముభావంగా ఉండసాగింది. శుక్రవారం రాత్రి అందరూ భోజనాలు చేసి నిద్రపోయారు. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వెంకటేష్‌ నిద్రలేచి చూడగా, కుమార్తె గదిలో చదువుకుంటూ కనిపించింది. ఈ టైంలో ఎందుకు చదువుతున్నావని అడగగా, వర్కు పెండింగ్‌ ఉందని చెప్పింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో నిద్రలేచిన తల్లికి గదిలో కుమార్తె ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో కేకలు వేయడంతో అందరూ నిద్రలేచి బాలికను కిందకు దింపారు. వెంటనే వన్‌టౌన్‌లోని ఆసుపత్రికి, అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

చికిత్స పొందుతూ మరో బాలిక..

కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని ఓ అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న రాచూరి రాంబాబు కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. కుమార్తె భాగ్యలక్ష్మి(16) ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఫస్టియర్‌ ఫలితాల్లో పలు సబ్జెక్ట్‌లు ఫెయిల్‌ అయింది. దీంతో మనస్తాపంతో ఆమె గత నెల 30న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లిదండ్రులు ఆమెను విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యవసర వైద్యం కోసం చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న భాగ్యలక్ష్మి శనివారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పెనమలూరు సీఐ వెంకటనారాయణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement