చిరు వ్యాపారులు, విద్యార్థుల్లో పొదుపు అలవాట్లు పెంపొందించాలి కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): చిరు వ్యాపారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామీణ కుటుంబాలు, విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే పొదుపు అలవాట్లు పెంపొందించటం ద్వారా ఆర్ధిక క్రమశిక్షణను తీసుకురావాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకె బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం క్యాంపు కార్యాలయం నుంచి గ్రామీణాభివృద్ధి, తపాలా, విద్యాశాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి యూనిట్లు నిర్వహిస్తున్న అనేక కుటుంబాలకు నెలవారీ కొంత మేర స్థిరమైన ఆదాయం ఉన్నప్పటికీ పొదుపు అలవాటు లేకపోవటం వల్ల అత్యవసర సమయంలో అప్పులపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. వచ్చిన ఆదాయం పూర్తిగా ఖర్చు చేయకుండా రోజువారీ, వీలైనంత తరచుగా కొంత మొత్తాన్ని పొదుపు చేసేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. పూర్వం అమలులో ఉన్న పిగ్మీ పొదుపు విధానాన్ని స్పూర్తిగా తీసుకుని తపాలా శాఖ ద్వారా మైక్రో సేవింగ్స్ విధానాన్ని గ్రామస్థాయిలో విస్తృతంగా అమలు చేయాలన్నారు. మండల స్థాయిలో ఏపీఎం, తపాలాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లోని వీవోఏలు, పోస్టుమాస్టర్లను అనుసంధానం చేయాలన్నారు. విద్యార్థుల్లో కూడా చిన్న వయసు నుంచే పొదుపు అలవాట్లు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో 19 వేల మంది విద్యార్థుల్లో ఇప్పటి వరకు 1200 మందికి మాత్రమే ఖాతాలు తెరిచిన నేపథ్యంలో మిగిలిన అర్హులైన విద్యార్థులకు పొదుపు ఖాతాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ హరిహరనాధ్, తపాలాశాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, డీఈవో యువీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


