ప్రత్యేక పిల్లల విద్యకు భరోసా | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక పిల్లల విద్యకు భరోసా

Oct 4 2026 10:55 AM | Updated on Oct 4 2026 10:55 AM

ప్రశస్త యాప్‌ ద్వారా స్క్రీనింగ్‌ త్వరితగతిన పూర్తి చేయాలి ఎంఈవోలకు అవగాహన కార్యక్రమంలో ఎన్టీఆర్‌ డీఈవో

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అవసరమైన సహాయ సహకారాలు, వసతులు కల్పిస్తూ సాధారణ పిల్లలతో సమానంగా విద్యను అభ్యసించేలా చూడాలని ఎన్టీఆర్‌ జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్‌ చంద్రకళ సూచించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల (సీడబ్ల్యూఎస్‌ఎన్‌) విద్య, గుర్తింపు, వారికి అందుతున్న ప్రభుత్వ పథకాలు, సౌకర్యాలపై జిల్లాలోని ఎంఈవో–1, ఎంఈవో–2లకు శనివారం విజయవాడలోని సీవీఆర్‌ మునిసిపల్‌ హైస్కూల్‌లో శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో చంద్రకళ మాట్లాడుతూ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన వారిని ఉపాధ్యాయులు చిన్న వయస్సులోనే గుర్తించడం ఎంతో ముఖ్యమన్నారు. ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన ప్రశస్త యాప్‌ ద్వారా ప్రతి ఉపాధ్యాయుడు స్క్రీనింగ్‌ ప్రక్రియను పూర్తి చేసేలా ఎంఈవోలు పర్యవేక్షించాలని సూచించారు. స్క్రీనింగ్‌ ద్వారా గుర్తించిన పిల్లలకు పాఠశాలల్లో అడ్మిషన్లు కల్పించడంతో పాటు, వారు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు విద్య, వైద్యం, పునరావాసం తదితర సేవలు సమర్థవంతంగా అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ రమేష్‌ బాబు మాట్లాడుతూ ప్రతి భవిత సెంటర్‌లో సుమారు 20 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అవసరమైన సేవలు అందుతున్నాయని తెలిపారు. భవిత సెంటర్ల ద్వారా పిల్లలకు ఫిజియోథెరపీ, స్పీచ్‌ థెరపీ వంటి సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఐదు మున్సిపాలిటీలకు ఒక ఆటిజం సెంటర్‌ ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో 2,351 మందికి పైగా సీడబ్ల్యూఎస్‌ఎన్‌ చిన్నారులు ఉన్నారని వెల్లడించారు.

‘ప్రత్యేక’ పిల్లలకు ప్రయోజనాలు..

జిల్లా సహిత విద్యా సమన్వయకర్త నారాయణ మాట్లాడుతూ ఆర్‌పీడబ్ల్యూడీ చట్టం, 2016 ప్రకారం 21 రకాల వైకల్యాలను ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రభుత్వం వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తోందన్నారు. ట్రాన్స్‌పోర్ట్‌ అలవెన్స్‌, హోమ్‌ బేస్డ్‌ ఎడ్యుకేషన్‌ అలవెన్స్‌, ఎస్కార్ట్‌ అలవెన్స్‌ కింద ఒక్కొక్కరికి రూ. 6,000 చొప్పున, బాలికలకు రూ. 2,000 స్టైపెండ్‌ అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గర్ల్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, విద్యాశాఖ అధికారులు, సహిత విద్యా సిబ్బంది, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement