కుక్కల దాడిలో వృద్ధురాలికి తీవ్రగాయాలు | - | Sakshi
Sakshi News home page

కుక్కల దాడిలో వృద్ధురాలికి తీవ్రగాయాలు

Oct 4 2026 10:55 AM | Updated on Oct 4 2026 10:55 AM

కుక్కల దాడిలో వృద్ధురాలికి తీవ్రగాయాలు గుర్తు తెలియని మృతదేహం లభ్యం రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం బల్లి పడిన నీరు తాగి కార్మికులకు అస్వస్థత

చల్లపల్లి: ఓ వృద్ధురాలిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మండలంలోని రామానగరంలో జరిగింది. లక్ష్మీపురం పంచాయతీ శివారు రామానగరానికి చెందిన 70 ఏళ్ల బి.కోటేశ్వరమ్మ శనివారం ఉదయం ఇంటి నుంచి రోడ్డు మీదకు వచ్చేసరికి ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి. ముఖం, కాళ్లు, చేతులు ఇలా అందిన చోటల్లా గాయాలు చేశాయి. స్థానికులు స్పందించి కుక్కలను తరిమి కొట్టారు. అప్పటికే ఆమె ముఖంపై ముక్కు, పెదాలు, బుగ్గలు ఆనవాళ్లు కూడా లేనంతగా పీకేశాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం చల్లపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో తొలుత మచిలీపట్నం, ఆ తర్వాత అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కృష్ణలంక(విజయవాడతూర్పు): కెనాల్‌లో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణా ఈస్ట్రన్‌ మెయిన్‌ కెనాల్‌లో ఒక మగ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు శనివారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. వారు వెళ్లి మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీసి పరిశీలించారు. మృతుని పేరు, వివరాలు లభించలేదు. వయస్సు 40 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉండవచ్చని, మృతదేహం కుళ్ళిపోయి దుర్వాసన వెదజల్లుతోందని తెలిపారు. మృతుని కుడి చేయిపై నరసయ్య, ఎడమ చేయిపై జి.లక్ష్మీ అని పచ్చబొట్లు ఉన్నాయని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

పటమట(విజయవాడతూర్పు): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన విజయవాడ పటమట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటమట ఆర్టీసీ కాలనీకి చెందిన బత్తెన అమర సందీప్‌(32) ఆటోనగర్లో శ్రీ సుబ్రమణ్య లారీ ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి సందీప్‌ స్నేహితుడు బెల్లంకొండ గౌతమ్‌ కుమార్‌ ఇంటికి వచ్చి ప్రభుత్వాసుపత్రిలో వారి స్నేహితులు ఉన్నారని, పలకరించి వస్తామని వెళ్లారు. ఈ క్రమంలో మహానాడు రోడ్డు నుంచి స్క్రూబ్రిడ్జి వైపు ఫ్లైఓవర వద్ద అర్థరాత్రి 12 గంటలు దాటాక నోవాటెల్‌ వద్ద వారి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు కాగా డ్రైవర్‌ సీటులో ఉన్న సందీప్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో సందీప్‌ స్నేహితుడు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పటమట పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య పూజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రమాద కారణాలను సీసీ కెమెరాలు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

జగ్గయ్యపేట: బల్లి పడిన నీరు తాగి 9 మంది కార్మికులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన జగ్గయ్యపేట పట్టణం శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏపీ–తెలంగాణ సరిహద్దులోని నేల కొండపల్లి మండలం అప్పలనర్సాపురం గ్రామంలోని ఓ స్పాంజ్‌ ఐరన్‌ కర్మాగారంలో ఒడిశా, బిహార్‌ రాష్ట్రాలకు చెందిన కార్మికులు పని చేస్తున్నారు. వారికి యాజమాన్యం కర్మాగారం సమీపంలోని వసతి గృహాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో మధ్యాహ్నం సమయంలో 9 మంది వసతి గృహంలోని తాగునీటి ట్యాంక్‌లో నీటిని తాగారు. కొద్దిసేపటికే వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ప్రత్యేక వాహనంలో జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఏడుగురు చికిత్స చేయించుకుని వెళ్ళిపోగా గోల్‌ కుమార్‌, కుమార్‌శర్మలను మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement