గంపలగూడెం: మండలంలోని మేడూరు గ్రామానికి చెందిన కోటేశ్వరి తనకున్న 50 సెంట్లలో వరి, మరో 1.7 ఎకరాలు కౌలుకు తీసుకుని పలు రకాల కూరగాయలు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగుగచేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ శనివారం ఆ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి రైతూ రసాయన రహి తంగా పంటలు పండించాలని సూచించారు. అనంతరం తునికిపాడులో ఇటీవల వర్షాలకు నేలవాలిన మొక్కజొన్న పంటలను పరిశీలించారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం అంచనాలు తయారు చేస్తారని తెలిపారు. మొక్కజొన్న, పెసర తదితర పంటలను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అథారిటీ చైర్మన్ సీహెచ్.దేవదత్తు, తిరువూరు ఆర్డీఓ ఎ.కుమార్, తహసీల్దార్ వి.రాజకుమారి, ఎంపీడీఓ టి.సరస్వతి, ఏఓ హారీష్‌రావు పాల్గొన్నారు.
నలుగురు సీఐలు బదిలీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో పరిధిలో నలుగురు సీఐలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు శనివారం ఆదేశాలు జారీ చేశారు. అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సీఐ బి.హెచ్.వెంకటేశ్వర్లును సీసీఎస్‌కు, ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ సీఐగా పనిచేస్తున్న డి.చంద్ర శేఖర్‌ను అజిత్‌సింగ్‌నగర్‌కు బదిలీ చేశారు. గుణదల సీఐ వి.శ్రీనును సైబర్ క్రైమ్‌కు, టూ ట్రాఫిక్ సీఐ వై.సత్యరమేష్‌ను గుణదల పీఎస్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
హాస్టల్ వాచ్‌మన్ మృతి
గంపలగూడెం: స్థానిక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వాచ్‌మన్ కొమ్మరవల్లి గంగరాజు(58) శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. హాస్టల్ ప్రాంగణంలో ఉన్న ఓ బల్లపై అనారోగ్యంగా కనిపించడంతో తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడు రావూరి స్వామి గంగరాజును గమనించాడు. తొలుత గంగరాజు నోటి నుంచి రక్తం వచ్చిందని, అనంతరం అతను మృతిచెందా డని స్వామి తెలిపాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. గంగరాజు స్వగ్రామం విజయవాడ సమీపంలోని గూడ వల్లి. మృతుని కుమారుడు గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శశిధర్ తెలిపారు.
నవాబుపేట సొసైటీ అధ్యక్షుడి ఆత్మహత్య
పెనుగంచిప్రోలు: మండలంలోని నవాబుపేట గ్రామ సొసైటీ అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు చింతా వెంకటేశ్వరరావు (బుల్లియ్య) (53) ఆత్మ హత్య చేసుకున్న ఘటన శనివారం తెల్లవారు జామున జరిగింది. తన ఇంటి ముందు రేకుల షెడ్డులో ఉరికి వేలాడుతున్న వెంకటేశ్వర రావును కుటుంబ సభ్యులతో పాటు చుట్టు పక్కల వారు చూసే సరికి మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలంగా తన తండ్రి మానసిక వేదనకు గురవుతున్నారని, ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున మృతి చెంది ఉండటాన్ని గమనించామని వెంకటేశ్వరరావు కుమారుడు రవి ఫిర్యాదు చేశారని ఎస్‌ఐ అర్జున్ తెలిపారు. వెంకటేశ్వరరావు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గింజుపల్లి వీరయ్య హత్య కేసులో, ఆయన కుమారుడు శ్రీనివాసరావుపై జరిగిన దాడి ఘటనలో ప్రధాన నిందితుడు.
పెదకాకాని: పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం హుండీలు తెరచి కానుకలు లెక్కించారు. దేవదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ హుండీల కానుకలు లెక్కింపు కార్యక్రమానికి పర్యవేక్షణాధికారిగా తెనాలి వైకుంఠపురంలోని పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఏసీ వి.అనుపమ హాజరయ్యారు. ఆలయంలో ఉదయం తొమ్మిది గంటలకు ఆలయ కల్యాణ మండపంలో కాను కల లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. 84 రోజులకుగాను హుండీల ద్వారా రూ.48,76,103 ఆదాయం లభించినట్లు డీసీ గోగినేని లీలా కుమార్ తెలిపారు. అన్నప్రసాద వితరణ హాల్ లోని హుండీ ద్వారా రూ.281,368 సమకూరిందన్నారు. విదేశీ నగదు అమెరికన్ డాలర్లు 127 సమకూరినట్లు డీసీ గోగినేని లీలాకుమార్, చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, ఆలయ సిబ్బంది, పెదకాకాని ఎస్‌బీఐ మేనేజర్ శ్రీనివాసరావు, సిబ్బంది, సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.


