
తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి ఆత్మహత్య
హనుమాన్‌జంక్షన్ రూరల్: తల్లిదండ్రులు మందలించారనే కోపంతో తొమ్మిదో తరగతి విద్యార్థి పురుగుల మందు సేవించి అత్మహత్యకు పాల్పడ్డాడు.బాపులపాడు మండలం బండారుగూడెంకు చెందిన అలుగుల సుశాంత్ (14) తేలప్రోలులోని జెడ్పీ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థి. తరచుగా పాఠశాలకు వెళ్లకపోవడం, చదువును అశ్రద్ధ చేయటంతో తల్లిదండ్రులు సుశాంత్‌ను ఈ నెల 21వ తేదీ మందలించారు. హాస్టల్‌లో చేర్పిస్తామని హెచ్చరించారు. తీవ్ర మనస్తాపం చెందిన సుశాంత్ ఇంటి ఆవరణలో గడ్డివామి వద్ద భద్రపర్చిన పురుగుల మందు డబ్బా తీసుకుని సేవించారు. తండ్రి జోజిబాబు సుశాంత్‌ను చిన్నవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
‘చంద్రబాబు రైతులకు ఏం చేశాడు’
జగ్గయ్యపేట అర్బన్: చంద్రబాబు ఎన్నికలపుడు రైతులకు రూ .20 వేలు ఇస్తానని హామీ ఇచ్చి ఏడాది దాటినా ఇవ్వలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఇప్పుడు ఏడాది తర్వాత ప్రధాని నరేంద్రమోదీ రూ.2 వేలు ఇస్తున్నాడు కాబట్టి వాటికి రూ.5 వేలు జమచేసి మొత్తం రూ.7 వేలు రైతులకు ఇస్తామంటున్నాడని, ఇదేనా మీరు రైతులను ఆదుకునేది అని రామకృష్ణ అన్నారు. సీపీఐ ద్వితీయ జిల్లా మహాసభలు శుక్రవారం జగ్గయ్యపేట పట్టణంలో ఆర్టీసీ డిపో సెంటర్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. నేతలు బలుసుపాడు సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన సభా వేదిక వరకు ర్యాలీ నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ అమెరికాకు లొంగిపోయాడని ట్రంప్ అంటేనే వణుకన్నారు. వంద ఏళ్ల చరిత్ర కలిగిన సీపీఐ ఎన్నో ప్రజా ఉద్యమాల్లో అగ్రభాగాన నిలబడిందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్ తదితరులు పాల్గొన్నారు.