
‘అగ్రిగోల్డ్’ భూములపై నివేదిక ఇవ్వండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో అగ్రిగోల్డ్ ఫామ్స్ కంపెనీ భూములకు సంబంధించి సమగ్రమైన నివేదికను వెంటనే అందజేయాలని కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ అధికారులను ఆదేశించారు. ఆమె చాంబర్‌లో అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి సంబంధిత అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఏలూరు ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను వేలం వేసి, తదుపరి చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలోని గన్నవరం మండలంలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలను తెలియజేయాలని ఆర్డీవోకు సూచించారు.
అగ్రిగోల్డ్ భూములు ఇవే..
గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో అగ్రిగోల్డ్‌కు సంబంధించి 23.92 ఎకరాల భూమి, భవనాలు, కర్మాగారాలు, యంత్ర సామగ్రి ఉన్నాయని ఆర్డీవో ఇన్‌చార్జ్ కలెక్టర్‌కు వివరించారు. ఆ ఆస్తులను తాను, డీఎస్పీ పరిశీలించామన్నారు. అనంతరం ఇన్‌చార్జ్ కలెక్టర్ స్పందిస్తూ భూముల నివేదికతో పాటు గన్నవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఆ ఆస్తులకు సంబంధించిన విలువ వివరాలను అధీకృత సంస్థ నుంచి ఆ ఆస్తులకు సంబంధించిన బహిరంగ మార్కెట్ విలువను కూడా సేకరించి ఇవ్వాలన్నారు. ఈ భూములను మ్యూటేషన్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అయితే ఆ భూములపై బ్యాంకు రుణాలున్న నేపథ్యంలో మ్యూటేషన్‌కు వీలులేదని ఆర్డీవో బదులిచ్చారు. వాటిన్నంటినీ క్రోడికరిస్తూ సమగ్ర నివేదికను సమర్పించాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ ఆదేశించారు. డీఆర్వో కె. చంద్రశేఖరరావు, గుడివాడ ఆర్డీవో జి. బాలసుబ్రహ్మణ్యం, గన్నవరం సబ్‌రిజిస్ట్రార్ వీవీప్రసాద్, సీఐడీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసకుమార్, అగ్రిగోల్డ్ ప్రతినిధి యలవర్తి శరత్‌బాబు తదితరులు ఉన్నారు.
కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ