
అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో బంగారు పతకం
నరసరావుపేట ఈస్ట్: మండలంలోని గురవాయిపాలెం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ నాగ రవీంద్ర అంతర్జాతీయస్థాయి పరుగు పందెంలో సత్తా చాటాడు. నేపాల్ దేశంలోని పోక్రాలో నిర్వహించిన ఇండో–నేపాల్ ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్ – 2025 అథ్లెటిక్స్‌లో 200 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించి అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. ఈనెల 24వ తేదీ నుంచి 28 వరకు యూత్ అండ్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించినట్టు నాగరవీంద్ర సోమవారం తెలిపారు. నాగరవీంద్ర నాగార్జున సాగర్‌లోని ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. కర్నూలుకు చెందిన కోచ్ షేక్ ఫయాజ్ ప్రోత్సాహంతో గతంలోనూ విశాఖపట్నం, గోవాలలో నిర్వహించిన రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చాటాడు.
పారిశ్రామికవేత్తలూ మార్గదర్శులుగా ముందుకు రండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ 4 విధానంలో పారిశ్రామికవేత్తలు మార్గదర్శులుగా ముందుకు వచ్చి బంగారు కుటుంబాలకు చేయూత అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ(డీఐఈపీసీ) సమావేశం జరిగింది. సమావేశంలో పారిశ్రామిక విధానాల కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అనుమతులు తదితరాలపై చర్చించారు. 2025 మే 26 నుంచి జూలై 28 వరకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పారిశ్రామిక అనుమతులకు సంబంధించి 1,148 దరఖాస్తులు స్వీకరించగా, వీటిలో ఇప్పటికే 1,113 దరఖాస్తులు ఆమోదం పొందాయని పరిశ్రమల శాఖ అధికారులు వివరించారు. మిగిలిన దరఖాస్తులను కూడా త్వరితగతిన గడువుకు ముందే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి అందించే ప్రోత్సాహకాలలో భాగంగా 39 క్లెయిమ్‌లకు రూ.3 కోట్ల మేర ప్రతిపాదనలను తాజాగా చర్చించి డీఐఈపీసీ ఆమోదం తెలిపింది. క్లెయిమ్‌లను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.
పీఎం విశ్వకర్మ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి
ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమాన్ని(పీఎంఈజీపీ) జిల్లాలో వేగవంతం చేయాలని, నిర్థేశించిన లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ చెప్పారు. ప్రధానమంత్రి విశ్వకర్మ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు బ్యాంకుల నుంచి రుణాలను త్వరితగతిన మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్‌ను ఆదేశించారు. రుణాలు మంజూరైన యూనిట్లను త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలని, పీఎం విశ్వకర్మ దరఖాస్తులపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహ పరిశ్రమలను పొత్సహించేందుకు ఉద్దేశించిన ర్యాంప్ కార్యక్రమంపై అవగాహన కల్పించేలా జిల్లా స్థాయిలో వర్క్ షాప్ నిర్వహిస్తామని కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి సాంబయ్య, ఎల్‌డీఎం కె.ప్రియాంక, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ పి.శ్రీనివాసరావు, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకర్‌రావు, జిల్లా భూగర్భజల అధికారి ఎన్.నాగమల్లేశ్వరరావు, కమిటీ సభ్యులు డి.నిర్మల, ఎం.కిశోర్, ఎం.సుదర్శన్ పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ

అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో బంగారు పతకం