
ఏసీ సర్వీసింగ్ మెకానికే.. నిందితుడు
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఇంట్లో బీరువాలో భద్రపరిచిన నగదును చోరీ చేసిన నిందితుడిని కొత్తపేట పోలీసులు 18 గంటల్లో అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.4.35 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు కొత్తపేట సీఐ చిన్న కొండలరావు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం సాయంత్రం టేనర్‌పేట అడ్డరోడ్డులోని కొండ కృష్ణ ఇంట్లోని బీరువాలో రూ.5 లక్షలు నగదు చోరీకి గురైంది. బాధితుడు ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడి ఇంటి చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలో నమోదైన పుటేజీని పోలీసులు పరిశీలించారు. సంఘటనా జరిగిన సమయానికి కొద్దిసేపటి తర్వాత బాధితుడి ఇంటి నుంచి ఓ యువకుడు బయటకు వస్తున్నట్లు గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడి వివరాలను తెలుసుకుని సదరు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అయోధ్యనగర్‌లోని శాంతినగర్‌కు చెందిన తాడికొండ పవన్‌కుమార్‌గా గుర్తించారు. అతను ఏసీ సర్వీసు చేస్తుంటాడని, కొద్ది రోజుల కిందట కృష్ణ ఇంటికి వచ్చి ఏసీ సర్వీసు చేసినట్లు గుర్తించారు. ఏసీ సర్వీసుకు వచ్చిన తరుణంలో కృష్ణ, అతని భార్యతో ఆర్థిక పరమైన అంశాల గురించి మాట్లాడుకోవడం పవన్ గమనించాడు. పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న పవన్ చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత భారీగా డబ్బులు ఉంటాయని భావించిన పవన్ సోమవారం కృష్ణ ఇంటి పరిసరాల్లో తిరుగుతూ ఎవరూ లేని సమయం చూసుకుని చోరీకి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ. 4.35 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూ.65 వేలు ఖర్చు చేసినట్లు నిందితుడు అంగీకరించగా, నిందితుడిని కోర్టులో హాజరు పరిచినట్లు వెస్ట్ ఏసీసీ దుర్గారావు పేర్కొన్నారు.
18 గంటల్లో నిందితుడి అరెస్ట్ రూ.4.35 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు