
అడ్డగోలు భూ సంతర్పణ ఆపాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు, తమకు కావాల్సినవారికి అడ్డగోలుగా చేస్తున్న భూ సంతర్పణ ఆపాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ స్థలాలను కారుచౌకగా లులు మాల్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో మంగళవారం నిరసన కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అధ్యక్షతన జరిగిన ఆందోళనలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రులు, ఎంపీలు, కార్పొరేట్ సంస్థలకు భూ కేటాయింపులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదేనా సంపద సృష్టి..
ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏ కేబినెట్ సమావేశం నిర్వహించినా, ఇండస్ట్రీయల్ ప్రమోషన్ సమావేశం జరిగినా ఆయాచితంగా వారికి కావాల్సిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సంస్థలకు ఇబ్బడిమబ్బడిగా భూములు కేటాయిస్తోందన్నారు. ఈ ఏడాది కాలంలో సుమారు 8 లక్షల ఎకరాల భూమిని కారు చౌకగా, రైతుబజారుల్లో కూరగాయల ధరల కన్నా తక్కువ ధరకు అప్పగిస్తోందని మండిపడ్డారు. విజయవాడ నడిబొడ్డులో ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల స్థలాన్ని అప్పనంగా లులు షాపింగ్ మాల్‌కు కేటాయించిందన్నారు. టెండర్ లేకుండా అడిగిందే తడవుగా స్థలం కేటాయించడాన్ని తప్పుబట్టారు. టెండర్ లేదా ఆక్షన్ ప్రకారం మార్కెట్ రేటుకు కేటాయించాలి అవేమీ లేకుండా అడ్డగోలుగా భూములు పందేరం చేస్తోందన్నారు. లులు మాల్ ఏర్పాటు వలన ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఏమాత్రం లేదన్నారు. పైగా ఈ మాల్ ఏర్పాటు చేస్తే బీసెంట్ రోడ్డు, కాళేళ్వరరావు మార్కెట్, గాంధీనగర్, గవర్నర్‌పేట పరిసరాల్లో చిరువ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు వ్యక్తులకు వందల ఎకరాలు కేటాయిస్తున్నారని ఇదేనా సంపద సృష్టి అని ప్రశ్నించారు. 2014–19 మధ్య కాలంలోనూ చంద్రబాబు ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేసి అమరావతి ప్రాంతంలో లబ్ధి పొందారన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధానం కొనసాగిస్తున్నారన్నారు. భూ కేటాయింపు వల్ల రాష్ట్ర ప్రజలకు జరిగే మేలేమిటో చెప్పాలని, ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లులుకు ఇచ్చిన జీవో రద్దు చేయాలని, భూ కేటాయింపులన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, కార్పొరేటర్లు ఇసరపు దేవి, తిరుపతమ్మ, మహిళా విభాగం నేతలు పేరం త్రివేణి, తోపుల వరలక్ష్మి, గుండె సుందర్‌పాల్, కాలే పుల్లారావు, ఒగ్గు గవాస్కర్, ఒగ్గు విక్కీ, సుధాకర్, కర్నాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటి వరకు జరిపిన భూ కేటాయింపులన్నీ రద్దు చేయాలి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాత బస్టాండ్ స్థలాన్ని లులుకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ధర్నా