జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఎస్.శర్మిష్ట
వడదెబ్బ తగలకుండా
జాగ్రతలు పాటించాలి
గుడివాడరూరల్: వేసవిలో వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఎస్.శర్మిష్ట పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని మోటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో బీట్ ద హీట్ పేరుతో వడదెబ్బ–తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులతో సాధారణంగా వడదెబ్బ, డీహైడ్రేషన్‌కు గురవుతున్నారన్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణహాని జరిగే అవకాశం ఉంటుందని వివరించారు. వడదెబ్బ తగిలితే మగత, నిద్ర, కలవరింతలు, శరీర ఉష్ణోగ్రత పెరగడం లేదా పాక్షికంగా అపస్మారక స్థితి, వణుకు పుట్టడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. రోజూ కనీసం 15గ్లాసుల నీరు, పళ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. అత్యవసరమైతే గొడుగు, టోపీ వంటివి తీసుకుని బయటకు వెళ్లాలన్నారు. జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ డెంగీ లక్షణాలు, దోమల బారిన పడకుండా తీసుకోవాల్సిన రక్షణ చర్యలను వివరించారు. డ్వామా పీడీ శివప్రసాద్ మాట్లాడుతూ వేసవిలో వేతన శ్రామికులు వేళలు మార్చుకుని ఉదయం 6గంటలకు ఉపాధి పనులకు వచ్చి 10గంటల లోపే ముగించుకోవాలన్నారు. అనంతరం వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కళాభారతి కళాజాత బృంద నాయకులు శేఖర్‌బాబు, ప్రశాంత్‌కుమార్ ప్రజలకు అవగాహన కల్పించారు. వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన కరపత్రాలను డీఎంహెచ్‌వో అధికారులతో కలసి ఆవిష్కరించి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను ప్రజలతో చేయించారు. పీహెచ్‌సీ ప్రాంగణంలో మొక్కలు నాటించారు. తొలుత పీహెచ్‌సీకి ఆరోగ్యశాఖ సిబ్బంది బంతు తనూజ, తలారి శ్రావణిలు ఎయిర్‌కూలర్‌ను, గంటా వెంకట రామానుజరావు ఒక ఏసీని వితరణగా అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కూరగంటి పద్మ, జిల్లా కార్యక్రమ అధికారి నిరీక్షణరావు, ఎంపీడీవో విష్ణుప్రసాద్, పీహెచ్‌సీ డాక్టర్లు ప్రీతి, తేజ, మహేష్, హిమబిందు, పంచాయతీ సెక్రటరీ కోటయ్య తదితరులు పాల్గొన్నారు.


