ఇంకెంత కాలం!
● గోకులం బిల్లుల కోసం పాడిరైతుల నిరీక్షణ ● జిల్లాలో 1,081 గోకులం షెడ్లు మంజూరు ● 1,051 పనులు ప్రారంభం.. 751 షెడ్లు నిర్మాణం పూర్తి ● మిగిలినవి వివిధ దశల్లో నిలిచాయి ● లబ్ధిదారులకు రావాల్సిన నిధులు రూ.6.19 కోట్లు
పెడన: గోకులం, మినీ గోకులం పథకాల కింద పశువుల షెడ్లు నిర్మించుకున్న పాడి రైతులు బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు. ఐదు నెలలు దాటినా బిల్లులు రాకపోవడంతో ఇంకెంత కాలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రాయితీ ఇస్తోందని ముందుకొచ్చిన వారి ఆశలు అడియాసలుగా మారు తున్నాయి. ఒక్కో షెడ్డు నిర్మాణానికి రూ. లక్షలు ఖర్చు చేసినా నేటి వరకు బిల్లులు అందలేదు. ఎప్పటికి వస్తాయనేది తెలియడం లేదు. అప్పులు చేసి నిర్మించామని, ఇప్పటి వరకూ నగదు ఇవ్వకపోవడంతో అప్పులే మిగిలాయని పాడి రైతులు వాపోతున్నారు. జిల్లాలో 1,081 గోకులం షెడ్లు మంజూరు కాగా 1,051 షెడ్ల పనులు ప్రారంభించారు. 751 షెడ్లను రైతులు నిర్మించుకున్నారు. ఇవి పూర్తై ఐదు నెలలు దాటి ఆరో నెల వచ్చినా రావాల్సిన బిల్లులు రూ.6.19 కోట్ల ఇంకా విడుదల చేయలేదు. ఎన్నికల సమయంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని ఎడాపెడా హామీలిచ్చిన సీఎం చంద్రబాబు ఇప్పుడు స్పందించకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. గ్రామాల్లో పశుపోషకులు గోకులం షెడ్ల పనులు ప్రారంభించిన తర్వాత ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో మధ్యలో నిర్మాణ పనులను నిలిపేసినవి కూడా ఉన్నాయి.
పాడి రైతులంటే చిన్నచూపా!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల తర్వాత పాడిరైతుల అభివృద్ధికి మినీ గోకులం షెడ్లు నిర్మిస్తామని ముందుకు వచ్చింది. కేంద్ర సహకారంతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ పెంచి పశుపోషకుల జీవన శైలి మెరుగుపర్చాలన్నదే గోకులం షెడ్ల ప్రధాన లక్ష్యమని పేర్కొంది. ఉపాధి పథకం ద్వారా నిర్మించే గోకులం షెడ్లకు.. పశువుల షెడ్లకు 90 శాతం రాయితీ, గొర్రెలు, మేకలు, కోళ్లకు 70 శాతం రాయితీ ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వీటిని నిర్మించాలని సంకల్పించింది. రెండు పశువులకు రూ.1.15లక్షలు, నాలుగు పశువులకు రూ.1.85 లక్షలు, ఆరు పశువులకు రూ.2.30లక్షలను అందిస్తామని పేర్కొంది. ఇందులో లబ్ధిదారుని వాటా పది శాతంగా తెలిపింది. ఆరు పశువులకు నిర్మించే షెడ్డుకు రూ.2.30లక్షలు కేటాయించగా లబ్ధిదారుని వాటా రూ.23వేలు పోగా మిగిలిన రూ.2.07 లక్షలు ప్రభుత్వం చెల్లించాలి. రెండు పశువులకు లబ్ధిదారుని వాటా రూ.11,500అయితే రూ.1,03,500 ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 90, 70 శాతం సబ్సిడీ ఇస్తుండటంతో పాడి రైతులు ఆసక్తిగా సిఫార్సులతో మరీ గోకులం షెడ్లును నిర్మించుకున్నారు. తీరా ఇప్పుడు బిల్లులు రాకపోవడంతో కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతున్నారు.
అప్పులు చేసి మరీ..
గోకులాలకు రాయితీ ఇస్తామని ప్రభుత్వం పాడి రైతులకు ఆశపెట్టింది. దీంతో షెడ్ల నిర్మాణానికి రైతులు ముందుకొచ్చారు. నిర్మాణ దశలో ఉన్నప్పుడు రెండు విడతలుగా నగదు చెల్లించాలి. బేస్‌మెంట్ దశలో రూ.30 వేలు, షెడ్డు పూర్తి స్థాయిలో నిర్మించాక మిగిలిన నగదు ఇవ్వాలి. గోకులం షెడ్లు నిర్మాణం ప్రారంభించి ఐదు నెలలు దాటినా కూటమి ప్రభుత్వం ఒక్క పైసా కూడా చెల్లించలేదు. రైతులకు ఉపాధి హామీ మస్తర్ల రూపంలో చెల్లించాల్సిన నగదు కూడా నేటికీ జమకాలేదు. అప్పులు చేసి షెడ్లును పూర్తి స్థాయిలో నిర్మించారు. మరికొందరు రైతులు గోకులం షెడ్ల నిర్మాణ పనులు అసలు ప్రారంభించలేదు.
కృష్ణా జిల్లాలో 1,081 గోకులం షెడ్లు మంజూరు
జిల్లాలోని 25 మండలాల్లో 415 గ్రామ పంచాయతీల్లో 1,081 గోకులం షెడ్లు నిర్మాణానికి ఆమోదం వచ్చింది. వీటిల్లో 1051 షెడ్లు పనులు ప్రారంభమయ్యాయి. అత్యధికంగా బంటుమిల్లి మండలంలో 80 మంజూరయ్యాయి. ఆ తర్వాత బాపులపాడులో 78, గూడూరు 67, పెడన 62, కృత్తివెన్ను 60 చొప్పున మంజూరు కావడమే కాకుండా పనులు కూడా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 751 షెడ్లను పూర్తి స్థాయిలో నిర్మించారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో నిర్మించిన 751 షెడ్లకు సుమారుగా ఉపాధి శ్రామికుల వేతనాల రూపంలో రూ.6.19 కోట్ల నిధులు మంజూరు కావాల్సి ఉంది.


