పెడన మున్సిపల్ కమిషనర్‌పై సీడీఎంఏకు ఫిర్యాదు
పెడన: పెడన మున్సిపల్ కమిషనర్ ఎం.గోపాలరావు పనితీరు సక్రమంగా లేదని, మున్సిపల్ స్థలాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు సీడీఎంఏకు ఫిర్యాదు చేశారు. అమరావతిలోని సీడీఎంఏ కార్యాలయంలో సీడీఎంఏ పి.సంపత్‌కుమార్‌ను కలిసి ఈ మేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ కౌన్సిలర్ కటకం ప్రసాద్ మాట్లాడుతూ పెడన పట్టణ మున్సిపాలిటీకి చెందిన ఆర్‌ఎస్ నంబర్ 366–1బి లో 18 సెంట్ల స్థలాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకున్న మున్సిపల్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావుపై సివిల్ అండ్ క్రిమినల్ చర్య తీసుకోవడానికి వీలు లేకుండా మున్సిపాలిటీ స్థలాన్ని అమ్ముకున్న వారికి సపోర్ట్ చేస్తున్న పెడన మున్సిపల్ కమిషనర్ ఎం.గోపాలరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ ఏడాది జనవరి 21న పెడన మున్సిపాలిటీకి చెందిన 9వ వార్డు కౌన్సిలర్ గరికిముక్కు చంద్రబాబు తన లేఖ ద్వారా ఒక అంశాన్ని అజెండాలో చేర్చి కౌన్సిల్లో చర్చించి, తీర్మానించి ప్రభుత్వానికి పంపించవలసిందిగా కోరారన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ రిపోర్ట్ నంబర్ 84సి నంబర్ 1241/బి, అండ్ జి/ఈ1– 2025 ప్రకారం ఇది 2017 సెప్టెంబరు 6న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ డిపార్ట్‌మెంట్ పెడన మున్సిపాలిటీకి తెలిపిన విధంగా పెడన మున్సిపాలిటీకి చెందిన ఆర్‌ఎస్ నంబర్ 366–1 బి లో 18 సెంట్ల తామరచెరువు ప్రభుత్వ స్థలాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు కబ్జా చేసి ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. మున్సిపాలిటీకి చెందిన 18 సెంట్ల స్థలాన్ని అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్న వారిపై సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకునే నిమిత్తం కౌన్సిల్ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని కోరామన్నారు. కౌన్సిల్ మీటింగ్‌లో ఈ విషయాన్ని ఒక అంశంగా చేర్చమని కమిషనర్ ఎం.గోపాలరావుకు పంపించామన్నారు. ఈ విషయమై కమిషనర్ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్‌కు లీగల్ ఒపీనియన్ నిమిత్తం పంపించారని, వారి వద్ద నుంచి ఈ అంశం న్యాయంగానే ఉందని రిపోర్టు ఇచ్చారని సీడీఎంఏకు వివరించారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో కౌన్సిల్లో కమిషనర్ నోటిఫై చేసి తీసుకురాకుండా కౌన్సిల్‌ను తీవ్ర అవమానపరిచారని అన్నారు. కౌన్సిల్ సమావేశంలో సభ్యులు పలుమార్లు అడిగినా సమాధానం దాటవేశారని తెలిపారు. అదీ కాకుండా కౌన్సిల్ సభ్యులను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ఎండార్స్‌మెంట్‌లు పంపించారని తెలిపారు. సదరు కమిషనర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సీడీఎంఏను కలసిన వారిలో కటకం ప్రసాద్‌తో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ ఖాజా, కౌన్సిలర్ చంద్రబాబు, వైఎస్సార్‌సీపీ నాయకుడు కోమట్ల అనిల్ తదితరులున్నారు.


