ఉద్యోగ ఆరోగ్య పథకం ప్రయోజనం పొందేలా చర్యలు
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఆరోగ్య పథకం ప్రయోజనం పొందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ పథకం పొందేందుకు వారి పేర్లు నమోదు చేయటం, సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో చాలా మంది సచివాలయ ఉద్యోగులు ఈ పథకం ప్రయోజనం పొందలేక ఇబ్బందులు పడుతున్నార న్నారు. ఈహెచ్‌ఎస్ కార్డులు లేని ఉద్యోగుల జాబితాలను కూడా సిద్ధం చేయాలన్నారు. బదిలీ అయిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తాను చేసిన వైద్యఖర్చులు ఏమైనా ఉంటే తిరిగి చెల్లింపు కోసం తాను పనిచేస్తున్న డ్రాయింగ్ ఆఫీసర్ ద్వారా బిల్లులు పంపేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఎన్టీఆర్ వైద్యసేవల ఈహెచ్‌ఎస్ విభాగం జేఈఓ డాక్టర్ సునీల, డెప్యూటీ ఈఓ కల్పవల్లి, ఆరోగ్యశ్రీ కో–ఆర్డినేటర్ డాక్టర్ సతీష్‌కుమార్ పాల్గొన్నారు.
చేయూత అందించండి
ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతను అందించా లని కలెక్టర్ డీకే బాలాజీ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను కోరారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మంగళవారం కార్పొరేట్ సంస్థలు, అధికారులతో సీఎస్‌ఆర్ నిధుల వినియోగంపై సమావేశం నిర్వహించారు. బెల్ కంపెనీ, నాబార్డు, ఎస్ ల్యాబ్ ప్రతినిధులతో సీఎస్‌ఆర్ నిధుల కేటాయింపుపై చర్చించారు. నిధుల కొరత వలన సగంలో నిలిచిపోయిన అంగన్‌వాడీ కేంద్ర భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు కార్పొరేట్ సంస్థలు సహకరించాలని కలెక్టర్ కోరారు. దివ్యాంగులకు ఉపకరణాలు సమకూర్చేందుకు, మొవ్వ డిగ్రీ కళాశాల, గుడివాడ ఐటీఐ కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటుకు, మార్కెట్ యార్డుల్లో కోల్డ్ స్టోరేజీ భవన నిర్మాణానికి నిధులు సమకూర్చాలన్నారు. పీఆర్ ఈఈ సుధాకర్‌గౌడ్, ఇన్‌చార్జ్ సీపీఓ పద్మజ, దివ్యాంగుల సంక్షేమశాఖ ఏడీ కామరాజు, ఏపీఎంఐడీసీ పీడీ విజయలక్ష్మి, బెల్ కంపెనీ డీజీఎం ఫణికుమార్, నాబార్డు కోఆర్డినేటర్ మహేష్, ఎస్ ల్యాబ్ ప్రతినిధి నరేష్ పాల్గొన్నారు.
కలెక్టర్ బాలాజీ


