ఇంటి దొంగ అరెస్ట్
182 గ్రాముల బంగారం స్వాధీనం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన వ్యక్తిని కొత్తపేట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.9 లక్షల విలువైన 182 గ్రాముల బంగారపు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను కొత్తపేట సీఐ చిన కొండలరావు మీడియాకు వివరించారు. జక్కంపూడి కాలనీలోని అటికల శివాజీకి దూరపు బంధువైన బొడ్డు రమణ(52) జీవనోపాధి కోసం విజయవాడ వచ్చాడు. ఈ నెల 1న రమణ శివాజీ కుమార్తె చింతల భారతి ఇంట్లోని బీరువాలో బంగారపు వస్తువులు, నగదును చోరీకి పాల్పడ్డాడు. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీసీ ఫుటేజీ ఆధారంగా..
నిందితుడు ఇంటి నుంచి బంగారపు వస్తువులను తీసుకుని ఆటోలో వెళ్లడం సీసీ కెమెరాలో రికార్డు అయింది. దీంతో పోలీసులు నిందితుడు ప్రయాణించిన ఆటోను గుర్తించి, డ్రైవర్‌ను ఆరా తీశారు. 3వ తేదీ సాయంత్రం రమణ బస్టాండ్ వద్ద తిరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. రమణకు వివాహం కాగా వ్యసనాల కారణంగా భార్య, పిల్లలను వదిలి విడిగా ఉంటున్నాడు. శివాజీ ఇంటికి వచ్చిన క్రమంలో భారతీ ఇంట్లో ఉన్న బంగారపు వస్తువులపై కన్ను పడింది. ఒకటో తేదీ ఇంట్లోని వారందరూ విస్సన్నపేటకు వెళ్లగా, అక్కడి నుంచి ఇంటికి వచ్చిన రమణ ఇంట్లో బీరువాను స్క్రూడ్రైవర్, కట్టర్‌తో పగలగొట్టి బంగారపు వస్తువులను కాజేశాడు. నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని సీఐ కొండలరావు అభినందించారు.


